బత్తాయి సాగు భారం

ABN , First Publish Date - 2023-08-30T00:41:23+05:30 IST

వాతావరణ మార్పులు, ఆశిస్తున్న తెగుళ్లు, భారీగా ధరలు పడిపోవడంతో బత్తాయి సాగు రైతన్నకు భారంగా మారింది. కనీసం పెట్టుబడి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది.

బత్తాయి సాగు భారం

భారీగా పడిపోయిన ధరలు

మంగు నల్లితో దెబ్బతింటున్న తోటలు

ఆందోళలో రైతులు

త్రిపురారం, ఆగస్టు 29: వాతావరణ మార్పులు, ఆశిస్తున్న తెగుళ్లు, భారీగా ధరలు పడిపోవడంతో బత్తాయి సాగు రైతన్నకు భారంగా మారింది. కనీసం పెట్టుబడి రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. బత్తాయిలో వేసవిలో వచ్చే కత్తెర కాయకు సాధారణంగా టన్ను రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ధర ఉండేది. ఈ ఏడాది మాత్రం రూ.15వేల రూ.30వేలకు మించి ధర పలకడంలేదు. ప్రధానంగా కాయకు అధికంగా మంగునల్లి సోకడంతో పాటు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో బత్తాయి సాగు పెరిగి అధిక దిగుబడులు రావడంతో ధరలపై ప్రభావం పడింది. ప్రస్తుతం సీజన్‌ కాయకు టన్ను రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ధర ఉంది. ఏటా ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ధర పలికేది. బత్తాయి అధికంగా ఎగుమతి జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు మహారాష్ట్ర నుంచి బత్తాయి ఎగుమతులు పెరగడంతో ధరలు పడిపోవడానికి కారణంగా భావిస్తున్నారు. ఢిల్లీ మార్కెట్‌కు ప్రతీ రోజు వందలాది లారీలు ఇక్కడి నుంచి వెళ్తున్నా, తగిన డిమాండ్‌ కారణంగా ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా బత్తాయి రైతులు నష్టపోతున్నారు.

పెట్టుబడులు రావడం లేదు

ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వేరుకుళ్లు, మం గునల్లి వ్యాపించింది. ఇప్పటి వరకు రైతులు ఎకరానికి రూ.50వేల వరకు ఖర్చు చేసినా తెగుళ్లను నియంత్రించలేకపోయారు. కళ్ల ముందే తోటలు నిలువునా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ప్రస్తుతం కాయకు ఉన్న ధరల ప్రకారం ఎకరానికి రూ.20వేల ఆదాయం కూడా రాకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అకాల వర్షాలతో తోటలు దెబ్బతింటున్నాయి.నష్టపోయిన తోటలకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

బత్తాయి సాగు కష్టంగా మారింది : సత్యనారాయణ, బత్తాయి రైతు, త్రిపురారం, నల్లగొండ జిల్లా

నాకున్న రెండెకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నా. ఈ ఏడాది విపరీతమైన తెగుళ్లు వ్యాపించాయి.దిగుబడులు సరిగా రాలేదు. మంగు నల్లి వల్ల కాయ నాణ్యత పడిపోయింది. కత్తెర కాయ నుం చి ఇప్పటి వరకు ధర సరిగా లేదు. సుమారు లక్ష వరకు పెట్టుబడి పెట్టా. కనీసం పె ట్టుబడి రాలేదు. చేసిన కష్టం వృథా అయింది.నాకున్న ప్రధాన ఆదాయ వనరు బ త్తాయి సాగే. ఏ చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Updated Date - 2023-08-30T00:41:23+05:30 IST