చేనేతకు చేయూత ఏదీ?
ABN , First Publish Date - 2023-08-07T01:05:17+05:30 IST
చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తెచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు.
చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తెచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. నేతన్న బీమా పథకం గత ఏడాది ప్రారంభించగా, నిబంధనల కారణంగా సగం మందికి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. భూదాన్‌పోచంపల్లి పట్టు చీరలు, ఇక్కత్ డిజన్లు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నా, ఇక్కడి కార్మికులు మాత్రం పస్తులతోనే గడుపుతున్నారు. ఉత్పత్తులు పేరుకుపోవడంతో అమ్మకాలు లేక మాస్టర్ వీవర్స్ కార్మికులకు పని కల్పించలేక మగ్గాలు మూతపడే పరిస్థితి నెలకొంది. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమకు జవసత్వాలు పోసే దిశగా ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ఆశిద్దాం.
భూదాన్‌పోచంపల్లి
ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాని కి అనేక పథకాలు ప్రకటిస్తున్నా.. అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో క్షేత్రస్థాయిలో ఆ పథకాలు కార్మికుల దరి చేరడం లేదు. దీంతో కార్మికుల్లో నిరాశ, నిస్ఫృహలు అలుముకున్నాయి. కాగా, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరడం లేదు.
అందని నూలు సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎ న్‌హెచ్‌డీసీ) ద్వారా నూలుపై 10శాతం సబ్సిడీ ఇస్తోంది. డు రాష్ట్ర ప్రభుత్వం కూడా నూలు, ముడి సరుకులపై 40శాతం రాయితీ ఇస్తూ నూలుపై 50శాతం సబ్సిడీ కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. కానీ, ఈ పథకం అమలుకు విధించిన నిబంధనలు కార్మికులకు శాపంగా మారాయి. కార్మికుడు కొనుగోలు చేసిన నూలుపై సబ్సిడీ డబ్బు ఖాతాలో జమ కావాలంటే కనీసం రెండు నెలలు పడుతోంది. దీంతో కార్మికులు నానాటికీ పెరుగుతున్న నూలు ధరలకు మగ్గం నేసేందుకే జంకుతున్నారు.
త్రిఫ్ట్ స్కీం నేటికీ బాలారిష్టాల్లోనే
చేనేతశాఖ మంత్రి కేటీఆర్ ఆరేళ్ల క్రితం భూదాన్‌పోచంపల్లి వేదికగా త్రిఫ్ట్ స్కీ(పొదుపు పథకం) లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.60కోట్లు కేటాయించారు. కార్మికుడు సంపాదించిన సంపాదనలో 8శాతం ఆర్‌డీ-1 అకౌంట్‌లో జమచేస్తే ప్రభుత్వం అందుకు 16శాతం (రెట్టింపు డబ్బును) ఆర్‌డీ-2 ఖాతాలో జమ చేస్తుంది. జిల్లాలో 9వేల మంది చేనేత కార్మికులను త్రిఫ్ట్ స్కీంలో చేర్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చేనేత ప్రభావిత మండలాలు, గ్రామాల్లో ఈ పథకంపై అధికారులు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. కానీ, సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు 4,050 మంది కార్మికులను మాత్రమే త్రిఫ్ట్ పథకంలో చేర్పించారు. మొదట్లో కార్మికుడు డబ్బు జమచేసినా బ్యాంకర్లు బకాయిల కింద జమ చేసుకుంటారనే భయంతో ఈ పథకంలో చేరడం లేదని తెలుస్తోంది.
ఇక్కత్‌కు ప్రింటెడ్ దెబ్బ
పోచంపల్లి పట్టు చీర నాణ్యతను బట్టి రూ.6వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతుండగా, చేనేత డిజైన్లను కొన్ని కంపెనీలు కాపీ కొట్టి ప్రింటెడ్ సిల్క్ చీరలను తయారు చేసి, తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. పేటెంట్ హక్కులకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉన్నా, మొద్దు నిద్ర వీడడం లేదు. దీంతో చేనేత కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొన్నది.
పథకాలున్నా ఆశించిన స్థాయిలో చేకూరని లబ్ధి
చేనేత కార్మికుడు మరణిస్తే బున్‌కర్ యోజన పథకం కింద ఆర్థికసాయం లభించేది. కొన్నిసార్లు ఆపద్బంధు కింద ఆర్ధికసాయం అందజేసేవారు. వీటితోపాటు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్షాబీమా యోజన ఉన్నా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చడంలేదు.
జియో ట్యాగింగ్‌తో..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మగ్గాల జియోట్యాగింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంది. సబ్సిడీపై నూలు సరఫరా చేస్తోంది. అయితే ఆసుపోయడం, డిజైన్ వేయడం, రబ్బర్లు చుట్టి రంగు అద్దడం, నూలు వడకడం, ఆరగట్టడం, అచ్చు అతకడం, అల్లు చాపడం, కంటెలు పట్టడం, మగ్గం నేసే వివిధ ప్రక్రియలు ఉంటాయి. చేనేత కుటుంబంలోని సభ్యులందరూ భాగస్వాములైతేనే వృత్తి సాగుతోంది. జియోట్యాగింగ్‌ను ప్రామాణికంగా తీసుకోకుండా వృత్తితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ చేనేత బీమా వర్తింపచేసే విధంగా పథకాన్ని రూపకల్పన చేయాలని కార్మికులు కోరుతున్నారు. సహకార సంఘాల్లో కాకుండా కొన్ని కుటుంబాలు సొంతంగా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నాయి. వీరి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నేతన్న బీమాకు నిబంధనల గుదిబండ !
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేతన్న బీమా పథకంపై చేనేత, మగరమగ్గాల కార్మికులు హర్షం ప్రకటిస్తున్నా ..నిబంధనల మూలంగా వృత్తిదారులు సగం మందికి కూడా ఈ పథకం వర్తించే అవకాశం లేదు. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 34,001 మందికి లబ్ది చేకూరవచ్చు. కానీ, సుమారు 15వేల మందికి మాత్రమే బీమా పథకం వర్తించే అవకాశం ఉంది. ‘నేతన్నకు చేయూత’ పథకం లబ్ది దారులకు మాత్రమే ‘బీమా’ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కూడా తగినంత బడ్జెట్ లేదని ఇద్దరు అనుబంధ కార్మికులకు బదులు ఒక్కరికే అవకాశమిచ్చారు. దీంతో ఈ పథకం సగం మందికి మాత్రమే ‘బీమా ’ అమలు చేయనున్నారు. 59 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్న వాళ్లు 40శాతం మంది చేనేత వృత్తిపై పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా ఈ పథకం వర్తించదు. వయోపరిమితి తొలగించాలని, ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి రూ.5లక్షలు నామినీ ఖాతాలో జమ చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని, త్రిఫ్ట్ స్కీంతో సంబంధం లేకుండా జియోట్యాగింగ్ మగ్గమం కార్మికులతోపాటు ఇద్దరు అనుబంధ కార్మికులకు బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పోచంపల్లి ఇక్కత్ డిజైన్లకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్
ఖండాంతర ఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ చీరలు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు పొందాయి. 2016-17 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం పోచంపల్లి ఇక్కత్ చీరకు భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ -జీఐ) లభించింది. ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుని జీఐ గుర్తింపునిస్తారు. ఈ ఉత్పత్తులకు నాణ్యత, ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. జీఐ భద్రత ఉన్న వస్తువుల బ్రాండ్‌ను ఇతరులు దుర్వినియోగం చేయడానికి వీలుండదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు 2003లో కేంద్ర ప్రభుత్వం జీయోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్‌రైట్స్) కల్పించింది. తాజాగా మరోసారి దేశంలోనే బ్రాండ్ ఇమేజ్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీరలకు జీఐ గుర్తింపు రావడం విశేషం. పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు అనే చిటికి కళాకారుడు 1951లో చేనేత టైఅండ్‌డై సిల్కు చీరను మగ్గంపై సేసి పోచంపల్లి చిటికి చీరల రూపశిల్పిగా గుర్తింపు పొదాడు. ఈ వస్త్రాలకు విశ్వఖ్యాతి వస్తుందని భావించిన వస్త్రశిల్పి అనంతరాములు. ప్రసుతం ఆయన దివంగతులైనారు. గత 66 ఏళ్ల కాలంలో మగువల అభిరుచులకు అనుగుణంగా సిల్కు చీరల్లో అనేక మార్పులు తెస్తూ నూతన డిజైన్లను రూపొందిస్తూ తమ బ్రాండ్ ఇమేజ్‌ను సుస్థిరం చేసుకుంటున్నారు.. పోచంపల్లి చేనేత కళాకారులు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ‘ఇక్కత్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ’ సొంతం చేసుకున్న పోచంపల్లి హ్యాండ్లూమ్‌పార్కు ఇక్కత్ వస్త్ర డిజైన్లతో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి చేనేత వస్త్ర కళాకారులు చిలివేరు రామలింగం, గజం అంజయ్య, కర్నాటి అనంతరాములు, కర్నాటి విష్ణు, సాయిని భరత్, బోగ బాలయ్య తదితరులు చేనేత వస్త్ర కళాఖండాలను సృష్టించి విశేష ఆదరణ పొందారు. చిన్న మగ్గం తయారు చేయడంతోపాటు మగ్గంపై నేయడం, కుట్టులేకుండా జాతీయ పతాకం, జాతీయ నాయకుల చిత్రపటాలతోపాటు జాతీయ పతాకాన్ని, పచ్చీసు తదితర వస్తువులను కార్మికులు సృజనాత్మకతతో సృష్టించి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.