నాలుగు రోజుల తరువాత మృతదేహానికి పోస్టుమార్టం
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:41 PM
మృతిచెందిన నాలుగు రోజుల అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు, అధికారులు ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
అడవిదేవులపల్లి, డిసెంబరు 30 : మృతిచెందిన నాలుగు రోజుల అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు, అధికారులు ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా అడవిదేవులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాల్నెపల్లి గ్రామానికి చెందిన బత్తుల కాశయ్య, మాధవి దంపతుల కుమార్తె వర్షిత(20)కు అదే గ్రామానికి చెందిన మర్రి లక్ష్మయ్యతో తొమ్మిది నెలల కిందట వివాహమైంది. కాగా వర్షిత, లక్ష్మయ్యలు హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అద్దెకు నివాసం ఉంటూ జీవిస్తున్నారు. అయితే ఈ నెల 26న రాత్రి అద్దెకు ఉంటున్న ఇంట్లో వర్షిత ఉరివేసుకోని మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు మృతురాలికి పోస్టుమార్టం నిర్వహించకుండానే వర్షిత మృతదేహాన్ని స్వగ్రామం బాల్నెపల్లికి తీసుకొచ్చి తమ పొలంలో ఖననం చేశారు. అయితే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తమ కుమార్తె వర్షిత ఫోనను పరిశీలించగా అందులో వర్షితకు సంబంధించిన అనుమానాస్పద వీడియోలు ఉండడంతో తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని ఈ నెల 29న స్థానిక పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదుచేశారు. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా రూరల్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ సురే్‌షకుమార్ ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి నల్లగొండ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ కృష్ణమూర్తి, సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు. వర్షిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.