ఈతకు వెళ్లి యువకుడు మృతి
ABN , First Publish Date - 2023-06-11T00:45:00+05:30 IST
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది.
చింతపల్లి, జూన్ 10: ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన వేముల వెంకటయ్య సువర్ణ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన రాజు(18) ఎనిమిదో తరగతి వరకు చదివి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం చింతపల్లి మండల కేంద్రంలోని తన మేనమామ కొమెర తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. శనివారం తన మేనమామ కుమారుడైన శివతో కలిసి చింతపల్లి మండలకేంద్రం సమీపంలోని ఇదంబాయికి ఈతకు వెళ్లారు. బావిలోకి దూకిన రాజు నీరు మింగి బావిలో మునిగిపోయాడు. రాజు కనపడకపోవడంతో భయాందోళనకు గురైన శివ తన తండ్రికి సమాచారం అందించాడు. వెంటనే తిరుపతయ్యతో పాటు కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. ఈత వచ్చిన వారితో బావిలో వెతికించగా రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారాన్ని తిరుపతయ్య చింతపల్లి పోలీసులకు, తన బావ వేముల వెంకటయ్యకు అందజేశాడు. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారుడు రాజు నడుమునొప్పితో బాధపడుతుండటంతో నాటువైద్యం చేయిస్తున్నామని, ఆ ఇబ్బందితోనే ఈత కొట్టలేక బావిలో మునిగి మృతిచెందాడని పోలీసులకు అతడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మృతదేహాన్ని దేవరకొండ సివిల్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.