పత్తి రైతు చిత్తు

ABN , First Publish Date - 2023-03-31T00:06:39+05:30 IST

రైతులు తెల్ల బంగారంగా భావించే పత్తికి మార్కెట్లో ధర లేకపోవడంతో నిల్వచేసిన దిగుబడిని విక్రయించలేక, అలాగే ఉంచలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతివృష్టి, అనావృష్టి వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గగా, చేతికొచ్చిన కొద్దిపాటి పంటనూ విక్రయిద్దామంటే మార్కెట్లో ధర లేక ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టపోతున్నారు.

పత్తి రైతు చిత్తు
పత్తిని విక్రయించేందుకు తీసుకెళ్తున్న రైతులు

నాలుగు మాసాలు నిల్వచేసినా పెరగని ధర

క్వింటాలు ధర గత ఏడాది రూ.12 వేలు

ప్రస్తుతం రూ.7వేలు

మరో రెండు మాసాల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్‌

రైతులు తెల్ల బంగారంగా భావించే పత్తికి మార్కెట్లో ధర లేకపోవడంతో నిల్వచేసిన దిగుబడిని విక్రయించలేక, అలాగే ఉంచలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతివృష్టి, అనావృష్టి వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గగా, చేతికొచ్చిన కొద్దిపాటి పంటనూ విక్రయిద్దామంటే మార్కెట్లో ధర లేక ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టపోతున్నారు.

మోత్కూరు

వరుసగా మూడేళ్ల నుంచి కాలం కలిసి రాక ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడులు రాలేదు. గత ఏడాది పంట తగ్గినా ధర క్వింటాకు రూ.12వేల వరకు ఉండటంతో పెట్టుబడులు వస్తాయని రైతులు ఆశించారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో ధర తగ్గింది. రైతులు పంట విక్రయించాక వ్యాపారులు గోదాముల్లో నిల్వ చేశాక ధర పెరగడం ఏటా జరుగుతున్న తంతు. అయితే ఈ సారి సీన్‌ రివర్స్‌ అయింది. పత్తి తీత సమయం గత అక్టోబరు, నవంబరు మాసాల్లో క్వింటా ధర రూ.8వేలు ఉండగా, ప్రస్తుతం రూ.7 వేలకు పడిపోయింది. గత ఏడాది లాగే ధర పెరుగుతుందని భావించిన రైతులు విక్రయించకుండా ఇళ్లలో నిల్వ చేశారు. పత్తిని నిల్వ చేయడంతో తేమ శాతం తగ్గింది. అంతేగాక నాలుగైదు మాసాలు నిల్వ చేయడంతో ఈ కాలానికి అప్పుపై వడ్డీ పెరిగింది. ప్రస్తుతం ధర లేకపోవడంతో నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 8.42లక్షల ఎకరాల్లో పత్తి సాగు

వానాకాలం సీజన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 8,42,645 ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. యాదాద్రి జిల్లాలో 1,11,038 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 6,30,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 1,01,607 ఎకరాల్లో పత్తి సాగైంది. గత ఏడాది జూన్‌ మాసం నుంచే వర్షాలు అధికంగా కురవడంతో చేలల్లో గుంటుక తోలలేక ఒక దశలో కలుపు తీయలేని పరిస్థితి ఏర్పడింది. కలుపు మందు పిచికారీ చేసి కలుపు తీశారు. అధిక వర్షాలతో పత్తికి జాజు రోగం, చివరి దశలో గులాబి రంగు పురుగు ఆశించి దిగుబడులు తగ్గాయి.

తగ్గిన దిగుబడులు

ఓ ఏడాది నష్టపోయినా మరో ఏడాది కలిసి వస్తుందన్నది పత్తి రైతుల నమ్మకం. గత ఏడాది పత్తిధర మద్దతు ధరకు మించి రెట్టింపు క్వింటా రూ.12వేలు పలికింది. ఈ ఏడాది ధర ఇంకా ఎక్కువగా ఉంటుందని భావించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాల మంది రైతులు ఉత్సాహంగా పత్తి సాగు చేశారు. రైతులకు ఎక్కువ కమతాలు లేక ఏటా అదే భూమిలో ఒకే రకమైన పంట పత్తి వేయడం, పశువుల పెంట లాంటి సేంద్రీయ ఎరువులు వాడకుండా కాంప్లెక్స్‌ ఎరువులు మాత్రమే వినియోగించడం, అధిక వర్షాలు తదితర కారణాలతో ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గింది. వాతావరణం అనుకూలిస్తే సగటున ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలి. కాగా, వానాకాలం సీజన్‌లో ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు.

బీటీ విత్తనాల్లోనూ తగ్గిన సామర్ధ్యం

పత్తి నుంచి తీసిన విత్తనాలను ప్రాసెసింగ్‌ చేసి గతంలో విక్రయించే వారు. వాటికి చీడ పీడల బెడద ఎక్కువగా ఉండి దిగుబడులు రాక రైతులు నష్టపోయేవారు. 1998 శాస్త్రవేత్తలు చీడపీడలను తట్టుకునేలా బీటీ-1 పత్తి విత్తనాలు తయారు చేసి మార్కెట్‌లో వదిలారు. బీటీ-1 విత్తనాలు మార్కెట్లోకి వచ్చాక తెగుళ్లు తగ్గి దిగబడి పెరగడంతో రైతులు అధికంగా పత్తి సాగు వైపు వచ్చారు. ఆ తరువాత బీటీ-1లోనూ చీడపీడలను తట్టుకునే సామర్ధ్యం తగ్గడంతో మరిన్ని పరిశోధనలు చేసి బీటీ-2 విత్తనాలను మార్కెట్లోకి తెచ్చారు. గత మూడేళ్లుగా వీటి సామర్ధ్యం కూడా తగ్గిందంటున్నారు. మార్కెట్లో చాటుమాటుగా ఒకట్రెండు చోట్ల బీటీ-3 విత్తనాలు విక్రయిస్తున్నారని చెబుతున్నా అది దళారుల మోసమని, బీటీ-3 విత్తనం మార్కెట్లోకి రాలేదని చెబుతున్నారు. బీటీ-2లో చీడపీడలను నిరోధించే శక్తి తగ్గినందున ప్రత్యామ్నయం ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.

చేసేది లేక విక్రయిస్తున్న రైతులు

మరో రెండు మాసాల్లో జూన్‌లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. మళ్లీ వ్యవసాయ పెట్టుబడులకు డబ్బు కావాలి. పత్తిని ఇంకా నిల్వచేసినా ధర పెరుగుతుందన్న నమ్మకం లేదు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోంది. ఇళ్లలో నిల్వ చేసిన పత్తికి పురుగు ఆశిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద నిల్వ చేసిన పత్తిని గాలివానల నుంచి కాపాడేందుకు కప్పిన టార్పాలిన్లు లేచిపోయి తడుస్తోంది. పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.6,380 ఉంది. బయట మార్కెట్లో రూ.7వేలు ఉన్నందున సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండదు. దీంతో చేసేది లేక రైతులు పత్తిని విక్రయిస్తున్నారు. ఇప్పటికి సుమారు 65శాతం పత్తిని రైతులు విక్రయించగా, కేవలం 35శాతం మాత్రమే నిల్వ ఉంది.

ఎగుమతి లేక పెరగని ధర

గత వానాకాలం సీజన్‌లో పత్తి తీత ప్రారంభ రోజుల్లో 2021 అక్టోబరు, నవంబరు మాసంలో క్వింటా పత్తి ధర రూ.8వేలు ఉండగా, పత్తి తీత ముగిశాక, జనవరి, ఫిబ్రవరిలో ధర రూ.12వేలకు పెరిగింది. గత వానాకాలం సీజన్‌లో అంటే 2022 అక్టోబరు, నవంబరులో క్వింటా ధర రూ.8 వేల వరకు పలికింది. ఈ సారి గతానికి మించి ధర పెరుగుందని భావించిన రైతులు తొలుత తీసిన మైల పత్తి విక్రయించి మిగతా మొత్తాన్ని ఇళ్లు, వ్యవసాయబావుల వద్ద నిల్వ చేశారు. పత్తి సీజన్‌ ముగిసి మూడు మసాలు అవుతున్నా, క్వింటా ధర రూ.7 వేలే ఉంది. అప్పుడు విక్రయిద్దామంటే పత్తిలో 15 నుంచి 20 శాతం వరకు తేమ ఉండి తూకం ఎక్కువ వచ్చేదని, ఇప్పుడు పత్తిలో తేమ లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. అయితే ఏటా ప్రభుత్వం పత్తిని విదేశాలకు ఎగుమతి చేసేది. ఈ సారి అంతర్జాతీయంగా పత్తి గిరాకీ మందగించడంతో ఎగుమతి చేయడం లేదంటున్నారు. కాటన్‌, సీడ్‌ ఆయిల్‌, పిట్టు ధర ఆధారంగా పత్తి ధర ఉంటుంది. కాటన్‌, సీడ్‌ ఆయిల్‌కు మార్కెట్లో ధర పడిపోవడంతో పత్తి ధర పెరగడం లేదంటున్నారు. పత్తి ధర పెరగపోగా రోజుకింత తగ్గుతుండటంతో నష్టపోతున్నామని జిన్నింగ్‌ మిల్లుల యజమానులు చెబుతున్నారు.

ఇంట్లో నిల్వ చేశా : నక్క అబ్బయ్య, పత్తి రైతు, లక్ష్మీదేవికాల్వ

నేను ఏడు ఎకరాల్లో పత్తి సాగుచేశా. అధిక వర్షాలకు పత్తి చేను దెబ్బతిన్నది. గతంలో నాకు ఎకరాకు సుమారు 12క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సారి 8 క్వింటాళ్ల చొప్పున 56 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదట్లో రూ.8వేల చొప్పున సుమారు 15 క్వింటాళ్లు విక్రయించా. ఇంకా 41 క్వింటాళ్ల పత్తి ఇంట్లో నిల్వ చేశా. నాలుగు మాసాలవుతున్నా ధర పెరగకపోగా రూ.7వేలకు పడిపోయింది. పత్తి ఇంట్లో నిల్వ చేయడంతో పురుగు ఆశించి వాటి కారణంగా ఇంటిల్లిపాదికి శరీరంపై దురద వస్తోంది. ఇంకా నిల్వచేసినా ధర పెరుగుతుందన్న ఆశలేదు. అంతేగాక పురుగుల కారణంగా ఆరోగ్యాలు పడావుతున్నాయన్న భయంతో రూ.7వేలకు క్వింటా చొప్పున విక్రయించా. గత ఏడాది కంటే ఈ ఏడాది కూలీలు, పురుగు మందులు, దున్నకం తదితర పెట్టుబడుల ఖర్చులు పెరిగాయి. పత్తి దిగుబడి, ధర తగ్గింది. పత్తి నిల్వ చేస్తే శరీరాలపై దురద ఎందుకు వస్తుందన్నది సంబంధిత అధికారులు పరిశీలించాలి. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర నిర్ణయించాలి.

Updated Date - 2023-03-31T00:06:39+05:30 IST