300 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం

ABN , First Publish Date - 2023-09-23T00:28:41+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో 300 లీటర్ల కల్తీ పాలను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

300 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లా గౌస్‌నగర్‌లో ఘటన

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 22: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో 300 లీటర్ల కల్తీ పాలను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గౌస్‌నగర్‌కు చెందిన అంతటి శ్రీరాములుకు నాలుగు గేదెలు ఉండగా, పాల వ్యాపారం చేస్తున్నాడు. తనవద్ద ఉన్న గేదెల నుంచి తీసిన 20లీటర్లకు పరిసర ప్రాంత రైతులనుంచి మరో 30లీటర్ల పాలను సేకరించేవాడు. మార్కెట్‌లో డిమాండ్‌ మేరకు పాలపొడి కలిపి ఒక్కో రోజు 200నుంచి 300లీటర్ల వరకు పాలను తయారు చేసేవాడు. ఈ పాలను హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌, ఘట్‌కేస ర్‌, తార్నాక, అబ్సిగూడ ప్రాంతాల్లోని హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాపులు, అపార్ట్‌మెంట్లలో విక్రయించేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేసిన ఎస్‌వోటీ పోలీసులు శ్రీరాములు తయారు చేస్తున్న 300లీటర్ల కృత్రిమ పాలను, ఎనిమిది కిలోల పాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీరాములును భువనగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషనలో అప్పగించారు. స్వాధీనం చేసుకున్న పాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించినట్లు రూరల్‌ ఎస్‌ఐ బి.సంతో్‌షకుమార్‌ తెలిపారు. అక్రమార్జనే ధ్యేయంగా తినే వస్తువుల ను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సంబంధిత వ్యక్తులపై పీడీయాక్ట్‌ కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Updated Date - 2023-09-23T00:28:41+05:30 IST