Share News

Seethakka: ‘‘పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నా’’.. మంత్రిగా అనసూయ అలియాస్ సీతక్క

ABN , First Publish Date - 2023-12-07T15:10:57+05:30 IST

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతా అనుకున్నట్లే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ మొత్తం 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరిలో సీతక్క ప్రమాణం...

Seethakka: ‘‘పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నా’’.. మంత్రిగా అనసూయ అలియాస్ సీతక్క

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతా అనుకున్నట్లే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ మొత్తం 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరిలో సీతక్క ప్రమాణం (Minister Seethakka).. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నానను’’... అని ఆమె అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సీతక్క.. ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో శ్రమ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ సీతక్కగా పేరుగాంచింది.

సీతక్క వరంగల్ జిల్లా (Warangal District) ములుగు మండలం జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971 జూలై 9న జన్మించింది. సమయ్య, సమ్మక్క దంపతులకు సీతక్క రెండో సంతానం. సీతక్క పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం సీక్కకు చిన్నతనం నుంచే అలవరింది. ప్రజలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై చదువుతున్న రోజుల్లోనే ప్రశ్నించేది. తదనంతర కాలంలో ఆదీవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలపై రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ్రీరాముడిని వివాహం చేసుకుని తన పేరును సీతక్కగా మార్చుకున్నారు.

minister-seetakka.jpg

అయితే కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక.. 1996లో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు న్యాయశాస్త్రం అభ్యసించింది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సీతక్క గురించి తెలుసుకున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీతక్క 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూనే.. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

seetakka.jpg

అయితే 2014లో మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా నియమితమయ్యారు. కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు ప్రజల్లో మరింత అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల పరిధిలోని దాదాపు 275 గ్రామాలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు అడవి దారుల్లో పాదయాత్ర చేసి స్వయంగా అందజేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో సీతక్కపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Telangana Ministers: కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారంటే..

Updated Date - 2023-12-07T15:42:48+05:30 IST