జహీరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటా
ABN , First Publish Date - 2023-12-05T23:59:15+05:30 IST
వారి సమస్యల్లో భాగస్వామినై పరిష్కరిస్తా చెరకు రైతులకు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో సమావేశం
జహీరాబాద్, డిసెంబరు 5: జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యల్లో భాగస్వామినై పరిష్కరిస్తానని మాజీమంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ప్రజల సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలుచేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండ అమలుచేసి తీరుతామన్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నందున చెరకు రైతులకు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని, కర్మాగారంలో యథావిధిగా క్రషింగ్ కొనసాగేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారకకు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాటన్నింటికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఎన్నికలు వేరు, సమస్యలు వేరని వాటన్నింటని తనవంతు బాధ్యతగా చొరవ తీసుకుని పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్నారు. తాను అందరికి అందుబాటులో ఉండి, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చంద్రశేఖర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో చేతల్లో చేసి చూపుతామని పేర్కొన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఉజ్వల్‌రెడ్డి, ఝరాసంగం ఎంపీపీ అధ్యక్షుడు దేవిదాస్, కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, రాంలింగారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మక్సూద్, హన్మంతరావుపాటీల్, పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.