యాసంగి సాగు షురూ
ABN , First Publish Date - 2023-12-10T23:52:08+05:30 IST
యాసంగి సాగుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అంతటా దాదాపు వరికోతలు పూర్తికావొస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి.
3.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా
62,106 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత
సిద్దిపేటఅగ్రికల్చర్, డిసెంబరు 10: యాసంగి సాగుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అంతటా దాదాపు వరికోతలు పూర్తికావొస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవుతుంది. అయితే ఇప్పటికే పలుచోట్ల ధాన్యం సేకరణ పూర్తికావడంతో వెంటనే యాసంగిసాగుపై రైతులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ సారి ముందస్తుగానే సాగుపై కార్యాచరణను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది. యాసంగిలో జిల్లాలో మొత్తం 3.85 లక్షల ఎకరాల్లో పలు పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా రూపొందించింది. గత వానాకాలంలో మొత్తం 5 లక్షల ఎకరాల్లో పలు పంటలను సాగు చేయగా, వీటిలో వరి 3.63 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. యాసంగి పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా పొలాల దుక్కులు దున్నడం, వరి సాగుకు నార్లు పోయడం ప్రారంభించారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు.
వరిదే అగ్రస్థానం
యాసంగిలో 3.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఈ యాసంగిలో వరిదే అగ్ర స్థానంలో ఉండనున్నది. 3.60 లక్షల ఎకరాల్లో వరి, 15వేల ఎకరాల్లో మొక్కజొన్న, 800 ఎకరాల్లో సీట్‌కార్న్, 2వేల ఎకరాల్లో శనగ, 1000 ఎకరాల్లో వేరుశనగ, 7వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తున్నది. 62,106 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వినియోగించనున్నారని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యూరియా 23,089 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,982 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు 18,571 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 9,464 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడనున్నట్లు అధికారులు అంచనా వేశారు.