అధ్వానంగా సిద్దిపేట రింగురోడ్డు

ABN , First Publish Date - 2023-04-11T00:01:04+05:30 IST

సిద్దిపేట రింగు రోడ్డు పనులు అధ్వానంగా కొనసాగుతున్నాయి.

అధ్వానంగా సిద్దిపేట రింగురోడ్డు
పుల్లూరు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి

ప్రమాదకరంగా మూలమలుపులు

రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు

అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా పనులు

సిద్దిపేట రూరల్‌, ఏప్రిల్‌ 10 : సిద్దిపేట రింగు రోడ్డు పనులు అధ్వానంగా కొనసాగుతున్నాయి. సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూర్‌, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లోని గ్రామాలను కలుపుతూ సిద్దిపేట రింగ్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. రూ.160 కోట్ల వ్యయంతో నిర్మిస్తుండగా కాంట్రాక్టర్‌ ఇష్టారీతిగా పనులను చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యత పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సిద్దిపేట రూరల్‌ మండలంలోని రావురుకుల, పుల్లూరు గ్రామాల మధ్య సుమారు 6 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. కానీ అప్పుడే అనేకచోట్ల గుంతలు, పగుళ్లు ఏర్పడ్డాయి. రోడ్డు అంచున ధ్వంసమైంది. తారు పోయకముందు కంకర, డస్ట్‌కు అవసరమైనంత క్యూరింగ్‌ లేదు. కంకరకు సరిపడా డస్ట్‌ వినియోగించకపోవడంతో నాణ్యత లోపాలు తలెత్తుతున్నాయి. అందుకే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే పగుళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. పుల్లూరు నుంచి ముస్తాబాద్‌ ప్రధాన రహదారికి వెళ్లే దారి అనేక మూల మలుపులతో ప్రమాదకరంగా నిర్మించారు. అంతేకాకుండా రోడ్డు పక్కనే వ్యవసాయబావులు దర్శనమిస్తున్నాయి. అంతకుముందు దూరంగా ఉన్న వ్యవసాయబావులు విస్తరణ పనులతో రోడ్డు అంచుకు చేరాయి. నూతన రోడ్డు విశాలంగా ఉండడంతో ద్విచక్రవాహనాలు, స్కూల్‌ బస్సులు, ఆటోలు వేగంగా వెళుతున్నాయి. మూలమలుపులతో పాటు రోడ్డు పక్కన వ్యవసాయబావులతో ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరమున్నది. రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ బావుల వద్ద, మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బావుల చుట్టూ శాశ్వతంగా కాంపౌండ్‌ వాల్‌ నిర్మించాల్సిన అవసరమున్నది.

Updated Date - 2023-04-11T00:01:04+05:30 IST