మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం
ABN , First Publish Date - 2023-03-08T00:09:47+05:30 IST
మహిళల ఆరోగ్య సమస్యలపై సర్కారు దృష్టి సారించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నది.
అతివల కోసం ప్రతీ మంగళవారం మహిళా క్లినిక్‌లు
మెదక్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 4 ఆస్పత్రుల్లో నిర్వహణ
మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్, మార్చి 7: మహిళల ఆరోగ్య సమస్యలపై సర్కారు దృష్టి సారించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నది. మెదక్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, వెల్దుర్తి, శివ్వంపేట, మనోహరాబాద్ పీహెచ్‌సీలు.. సంగారెడ్డి జిల్లాలో ఆర్సీపురం, జిన్నారం, ఝరాసంగం, బిలాల్‌పూర్ పీహెచ్‌సీల్లో ప్రతీ మంగళవారం మహిళా క్లినిక్‌లను నిర్వహించనున్నారు.
8 ప్యాకేజీలు.. 57 రకాల పరీక్షలు
ఆయా ఆస్పత్రుల్లో మహిళలకు ఎనిమిది ప్యాకేజీల్లో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక వ్యాధి నిర్దారణ, క్యాన్సర్ స్ర్కీనింగ్, వెయిట్ మేనేజ్‌మెంట్, సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్లు, పీసీవోడీ, రుతుస్రావ సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటీ మేనేజ్‌మెంట్, మెనోపాజ్ మేనేజ్‌మెంట్, ఐవీ, యూటీఐ అండ్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాదులతో పాటు ఇతర సమస్యలతో వచ్చే మహిళలకు మహిళా క్లినిక్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ డయ్నాగోస్టిక్ పోర్టల్‌లో ప్రత్యేక లింకును రూపొందించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలను నమోదు చేస్తారు. ఏదైనా వ్యాధి నిర్ధారణ జరిగితే తగిన చికిత్స అందజేస్తారు. ఽథెరపీ మెడికేషన్స్, కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మెరుగైన వైద్యసేవలు అవసరమైతే జిల్లాస్థాయిలోని రిఫరల్ ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తుృత ప్రచారం చేయాలని నిర్ణయించారు.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
-చందునాయక్, మెదక్ జిల్లా వైద్యాధికారి
రాష్ట్ర సర్కారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి ఆరోగ్య మహిళ క్లినిక్‌లకు ప్రారంభిస్తున్నది. ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ప్రతీ మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా పరీక్షలు చేసి వైద్యసేవలు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.