మా ఓటు సంగతేంటి?
ABN , First Publish Date - 2023-11-19T23:37:09+05:30 IST
అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నది భారత ఎన్నికల సంఘం నినాదం. ఇందుకోసం కొన్ని నెలలుగా ఓటు హక్కు నమోదు, ఓటు వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్ కోరుతున్న పంచాయతీ కార్యదర్శులు
ఇంకా అందని ఆదేశాలు.. అవకాశమివ్వని అధికారులు
మెదక్ జిల్లాలో 469 మంది సెక్రెటరీలు
ఎన్నికల విధులతో ఓటుకు దూరం!
మెదక్ అర్బన్, నవంబరు 19: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నది భారత ఎన్నికల సంఘం నినాదం. ఇందుకోసం కొన్ని నెలలుగా ఓటు హక్కు నమోదు, ఓటు వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రచారంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పంచాయతీ కార్యదర్శులకు భాగస్యామ్యం కల్పించిన సందర్భాలు లేవు. కేవలం పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో మాత్రమే వీరికి విధులు కేటాయించేవారు. కానీ ఈ ఎన్నికల్లో మొదటిసారి పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల సంఘం విధులను అప్పగించింది. దీంతో ఈసారి సాధారణ ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మెదక్ జిల్లావ్యాప్తంగా 469 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కొందరికి బీఎల్‌వోలుగా, మరికొందరికి ఆర్‌వ్వోలుగా విధులు అప్పగించారు. ఈ అవకాశం కూడా తక్కువ మందికి కల్పించారు. మిగిలిన పంచాయతీ కార్యదర్శులు ఈ నెల 29, 30 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, ఇతర సిబ్బందికి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత చేపట్టాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ నేపథ్యంలో రెండు రోజులు కార్యదర్శులంతా అక్కడే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు
సాధారణంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీలను అందజేస్తుంది. ఈ కాపీతో ఫాం-12 ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఇలా అతి తక్కువ మంది పంచాయతీ కార్యదర్శులకు అర్డర్ కాపీలు అందడంతో వీరు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగితా వారందరూ అర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆదేశాలు అందకపోతే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓటేసేది ఎలా?
ఎన్నికల విధులు కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ నేపథ్యంలో రెండ్రోజుల పాటు పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ స్వగ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దాందో వారికి ఆయా గ్రామాల్లోనే ఓటుహక్కు ఉంటుంది. దీంతో పోలింగ్ రోజున పోస్టింగ్ ఉన్న గ్రామంలో విధులు నిర్వర్తిస్తుండడంతో స్వస్థలంలో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం
-అంబదాస్ రాజేశ్వర్, రిటర్నింగ్ అధికారి, మెదక్
జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ేురకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. నియోజకవర్గ పరిధిలోని ఆయా రిట్నరింగ్ అధికారి కార్యాలయంలో మూడ్రోజుల పాటు ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర నియోజకవర్గ పరిధిలోని వారికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారుల ద్వారా సిబ్బందికి సమాచారం అందిస్తాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.