అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:47 PM
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభలలో దరఖాస్తులు స్వీకరిస్తాం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, డిసెంబరు 26: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. ఈ నెల 28నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలలో పార్టీలకతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక చేస్తామని చెప్పారు. మంగళవారం ప్రజా పాలనపై నారాయణఖేడ్‌లో నియోజకవర్గంలోని అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 6 తర్వాత కూడా అర్హులు ఉంటే దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షాల నాయకులు ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా యత్నిస్తే అధికారులు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఫారాలు రిజెక్ట్ కాకుండా చూడాలన్నారు. పథకాలను అర్హులైన వారికి అందించే విషయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అధికారులు చట్టంపరిధిలో పని చేస్తూ, అర్హులకు పథకాలు అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి సురే్‌షమోహన్ మాట్లాడుతూ.. ఒక్క దరఖాస్తు రిజెక్ట్ కాకుండా అన్ని దరఖాస్తులు పూరించే విధంగా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో అన్నిశాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గ్రామసభల నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.10వేలు జమ అవుతాయన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, వైద్యులు రాజేష్, సేవాలాల్ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ చౌహాన్, కౌన్సిలర్లు వివేకానంద్, నాయకులు సద్దాం, హన్మండ్లు, గుండేరావు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు: సునితారెడ్డి
హత్నూర: ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాల అమలులు ప్రభుత్వం చేపట్టిన లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పని చేయాలని ఎమ్మెల్యే సునితారెడ్డి అధికారులకు సూచించారు. హత్నూర ఎంపీపీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 28నుంచి నిర్వహించే గ్రామ సభలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తులు స్వీకరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందాలని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజా పాలన బ్యానర్‌పై ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫోటో లేకపోవడంతో గుండ్ల మాచూనూర్ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, నాగులదేవులపల్లి సర్పంచ్ సుధాకర్‌లు అధికారులను నిలదీశారు. అంతే కాకుండా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులందరం సమావేశం నుంచి సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే వారికి నచ్చ చెప్పి శాంతింపజేశారు. సమావేశంలో ఎంపీపీ వావిలాల నర్సింలు, జడ్పీటీసీ ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి స్వప్న, తహసీల్దార్ సంధ్య, ఎంపీడీవో శారదాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.