అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:11 AM
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆయా పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూడటానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తంరూపాలా పేర్కొన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో గ్రామస్థాయికి కేంద్ర ప్రభుత్వ పథకాలు
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, ఎంపీ లక్ష్మణ్
నర్సాపూర్, డిసెంబరు 16: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆయా పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా చూడటానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తంరూపాలా పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 17 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. అర్హులందరికీ ఈ పథకాలు అందించే లక్ష్యంతోనే సంకల్ప యాత్ర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ యాత్ర జనవరి 26 వరకు కొనసాగుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు, బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల వివరాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఉజ్వల పథకం కింద పలువురు లబ్దిదారులకు మంత్రి చేతుల మీదుగా గ్యాస్‌కనెక్షన్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో సాయిబాబ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాసులు, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్, సర్పంచ్ పాతిమా, ఎంపీటీసీ శ్రీనివా్‌సగుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేష్, నాయకులు రఘువీరారెడ్డి, రమణారావు, చిన్నరమే్‌షగౌడ్, ఆంజనేయులుగౌడ్, కొత్తశ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలి : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్
పటాన్‌చె రు రూరల్, డిసెంబరు 16 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించడానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రతీ పేద కుటుంబం లబ్ధిపొందేలా చేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గణేష్ ఆలయం వద్ద వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పంచాయతీ పరిధిలో ప్రతీ పౌరుడికి కేంద్ర ప్రభుత్వం అందజేసే పథకాలపై ఈ ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. అర్హులందరూ లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రధాని మోదీకి పేదల కష్టాలు తెలుసని, అందుకే అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించి, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. తద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ప్రయోజనాలు దళారుల జేబుల్లో పడకుండా అడ్డుకట్ట వేశారని చెప్పారు. మోదీ ప్రవేశపెట్టిన ముద్ర లోన్ పథకం ద్వారా కోట్ల మంది వ్యాపారాలు ప్రారంభించగలిగారని అన్నారు. ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 10 కోట్ల మంది మహిళలకు గ్యాస్ అందిస్తున్న ఘనత భాజపాదేనన్నారు. అనంతరం వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వెలుగు పీడీ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి తదితరుల పాల్గొన్నారు.