జల పరవళ్లు

ABN , First Publish Date - 2023-03-19T00:12:02+05:30 IST

రైతాంగం కన్నీళ్లు తుడిచేందుకు సాకారమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మరో చరిత్రాత్మక జల ఘట్టం ఆవిష్కృతమైంది.

జల పరవళ్లు
నంగునూరు మండలంలో పరవళ్లు తొక్కుతున్న చెక్‌డ్యాం

పెద్దవాగును ముద్దాడిన గోదారమ్మ

మరో చారిత్రక జలఘట్టం ఆవిష్క ృతం

రంగనాయకసాగర్‌ నుంచి పరుగులు పెట్టిన కాళేశ్వర జలాలు

నంగునూరు మండలంలోని ఐదు చెక్‌డ్యాములకు ఇక నిరంతర జలకళ

జల పండగ చేద్దామని ఆనందం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 18 : రైతాంగం కన్నీళ్లు తుడిచేందుకు సాకారమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మరో చరిత్రాత్మక జల ఘట్టం ఆవిష్కృతమైంది. మన నీళ్లు, మన బీళ్లను తాకాలనే.. తెలంగాణ ఉద్యమ ఆశయానికి పల్లెపల్లెన పరుగులు పెడుతున్న గోదావరి జలాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కుండపోత వర్షాలకు మాత్రమే తడిసిముద్దయ్యే నంగునూరు పెద్దవాగును, కాళేశ్వరం జలాలు స్పృశించడం రికార్డుగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా గోదావరి జలాలు మానేరువాగు నుంచి వాగుల్లోకి పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం వల్ల రంగనాయకసాగర్‌ నుంచి పెద్ద వాగు ద్వారా గ్రామాల భూములను తడుపుతూ మానేరు రిజర్వాయర్‌లో కలవడం నిజంగా అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. గోదావరి జలాలకు కొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతకు రుణపడి ఉంటామని రైతులంతా ఆనందోత్సవాలకు సిద్ధమవుతున్నారు.

పరవళ్లు తొక్కుతున్న పెద్దవాగు

సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలోని పెద్దవాగును గోదారమ్మ మండుటెండల్లో ముద్దాడి పరవళ్లు తొక్కుతుంది. నాడు సాగునీరు లేక అల్లాడిన ప్రాంతంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో వారి ముందుచూపుతో ఘనపూర్‌, అక్కేనపల్లి చెక్‌డ్యామ్‌లను నిర్మించి కాళేశ్వరం జల ఫలాలు అందేలా చేశారు.

5 చెక్‌ డ్యామ్‌లు, 5వేల ఎకరాలకు సాగు నీరు

గతంలో పెద్దవాగులోకి నీరు చిట్యాల నాలా, దొమ్మాట నాలా నుంచి వచ్చి, మరో రెండు నాలాలైన అర్జున్‌పట్ల, ఆకునూరు మధ్యలో కలిసి పెద్దవాగులోకి ప్రవహించేవి. అక్కడి నుంచి శనిగరంలో కలిసి లోయర్‌మానేరుకు చేరి గోదావరి దారి పట్టేవి. కానీ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరే సుమారు 390 మీటర్ల ఎత్తిపోతల ద్వారా పెద్దవాగును ముద్దాడాయి. నంగునూరు మండలంలోని పెద్దవాగుపై 5 చెక్‌ డ్యాములున్నాయి. ప్రస్తుతం రంగనాయకసాగర్‌ కుడి కాలువ నుంచి ఐదో చెక్‌డ్యామ్‌ అయిన పెద్దోళ్లబావి కట్టకు నీరు విడుదలైంది. నాగరాజుపల్లి చౌటచెరువు మత్తడి దూకి, పెద్దోళ్ల బావి చెక్‌డ్యామ్‌పై భాగంలోకి నీరు వచ్చి చేరుతున్నది. ఈ చెక్‌డ్యామ్‌ నిండిన తర్వాత దిగువన మరో నాలుగు చెక్‌డ్యాములు నిండి 1200 ఎకరాలకు నీరు అందనున్నది. వాగు అవతలి గ్రామాలకు దాదాపు ఐదు వేల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందించనుండగా, భూగర్భ జలాల ద్వారా మరో 1200 ఎకరాల ఆయకట్టు లబ్ధి చేకూరనుంది. రంగనాయకసాగర్‌ కుడి కాలువ ద్వారా నంగునూరు మండలంలోని 25 చెరువులు, కుంటలు, ఐదు చెక్‌డ్యాములను గోదావరి జలాలతో నింపుతున్నారు. అందులో ఐదు చెక్‌డ్యాములు, ఐదు చెరువులు మత్తడి దూకుతున్నాయి.

త్వరలోనే రైతులతో కలిసి జల జాతర

మండుటెండల్లో నిండుకుండల్లా చెరువులు, చెక్‌డ్యామ్‌లు పరవళ్లు తొక్కడం ఒక చరిత్ర. ఇది సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనికి గొప్ప నిదర్శనం. అభివృద్ధి అంటే గొప్ప తృప్తి మనం చేసిన పనికి సార్ధకత వచ్చినప్పుడు. అంతటి గొప్ప సంతృప్తి ఇప్పుడు కలుగుతున్నది. అదే గోదావరి జలాలను కలలో కూడా చూస్తామా లేదా అన్న నానుడి నుంచి నేడు కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ముందుచూపుతో సీఎం చెక్‌డ్యామ్‌ నిర్మించడం వల్ల నేడు కాళేశ్వర జలాలతో సఫలమైంది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి. అందుకు సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా. త్వరలోనే పెద్దవాగుపై రైతులతో కలిసి జల జాతర, నీళ్ల పండుగను సంబురంగా నిర్వహిస్తాం.

- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Updated Date - 2023-03-19T00:12:02+05:30 IST