Share News

యాసంగి సాగుపై అనిశ్చితి

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:00 AM

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద యాసంగిలో సాగుపై అనిశ్చితి నెలకొన్నది. క్రాప్‌హాలిడే ప్రకటించి కల్వాలు మరమ్మతు చేస్తామని అధికారులు అంటుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాసంగి సాగుపై అనిశ్చితి

నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాప్‌హాలిడే!

కాల్వల మరమ్మతు కోసం తప్పదంటున్న అధికారులు

అభ్యంతరం వ్యక్తంచేస్తున్న రైతులు

ఇప్పటికే రెండుసార్లు క్రాప్‌హాలిడే ఇచ్చినా పనులు చేయలేదని మండిపాటు

నీళ్లున్నా రెండువేల ఎకరాలు బీడు!

కల్హేర్‌, డిసెంబరు 17: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద యాసంగిలో సాగుపై అనిశ్చితి నెలకొన్నది. క్రాప్‌హాలిడే ప్రకటించి కల్వాలు మరమ్మతు చేస్తామని అధికారులు అంటుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లవాగు ప్రాజెక్టు కింద 5,300 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,493 అడుగులు కాగా, ప్రస్తుతం 1,488 అడుగుల నీరుంది. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల పరిధిలోని 13 గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాలకు కుడి, ఎడమ, అత్యవసర కాలువల ద్వారా సాగు నీరు అందుతుంది. నీటి పారుదలశాఖ అఽధికారుల అంచనా ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో 2వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు నీరందించవచ్చు.

ఇప్పటికే రెండుసార్లు క్రాప్‌హాలిడే

నల్లవాగు ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణ కోసం 2018లో అప్పటి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రూ.24.54 కోట్లు మంజూరు చేయించారు. అప్పటి జిల్లా మంత్రి హరీశ్‌రావు పనులకు శంఖుస్థాపన చేశారు. పనుల నిర్వహణ కోసం 2018, 2019 సంవత్సరాల యాసంగి సీజన్లలో రైతులను ఒప్పించి క్రాప్‌హాలిడే ప్రకటించారు. కానీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో నేటికీ 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గడువు మించిపోయినా రూ. 7 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగు నీరు అందడంలేదు.

మరోసారి క్రాప్‌హాలిడేకు అధికారుల యత్నం

నాలుగున్నర సంవత్సరాలుగా పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేసి మరోసారి క్రాప్‌హాలిడే ఇస్తామని అఽధికారులు చెబుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. ఇదివరకు రెండుసార్లు పంటలు నిలిపివేసినా పనులు చేపట్టలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో 2వేల ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశమున్నా క్రాప్‌హాలిడే ప్రకటిస్తే పొలాలు బీడువారుతాయని వాపోతున్నారు. నీరు అందే అవకాశం ఉన్న 2వేల ఎకరాల్లో పంటలు వేసుకునే అవకాశమిచ్చి, మిగిలిన ఆయకట్టు పరిధిలోని కాల్వల పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

రైతుల నిర్ణయం మేరకే తైబంది : ఎమ్మెల్యే

నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల నిర్ణయం మేరకే యాసంగి తైబంది నిర్వహిస్తామని, రైతులతో సమావేశం ఏర్పాటు చేసేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన సిర్గాపూర్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన సభలోనే నీటిపారుదలశాఖ ఏఈ సూర్యకాంత్‌తో మాట్లాడి రైతులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుందామని సూచించారు.

Updated Date - Dec 18 , 2023 | 12:00 AM