సుందరీకరణకు నోచుకోని తూప్రాన్ పెద్దచెరువు
ABN , First Publish Date - 2023-06-23T23:44:28+05:30 IST
రూ.3.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సీఎం హామీ ఇచ్చి ఐదేళ్లయినా విడుదల కాని నిధులు
తూప్రాన్, జూన్ 23: సీఎం హామీ ఇచ్చి ఐదున్నరేళ్లవుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో తూప్రాన్ పెద్ద చెరువు సుందరీకరణకు నోచుకోవడం లేదు. తూప్రాన్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు మెదక్ జిల్లాలోని పెద్దచెరువుల్లో ఒకటి. ఈ చెరువు కింద 750 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. దశాబ్దం క్రితం పెద్దచెరువును వెడల్పు చేసి, మరమ్మతులు చేశారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని పాండవుల చెరువు మాదిరిగా తూప్రాన్ పెద్దచెరువును సుందరీకరణ చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 జనవరి 17న తూప్రాన్ పట్టణంలో నిర్మించిన 50 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్.. పెద్ద చెరువును సుందరీకరించనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో సుందరీకరణకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.80 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఐదున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో తూప్రాన్ పెద్దచెరువు కట్ట మీదకు వెళ్లేందుకు మత్తడి వద్ద చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం పైపులు ఏర్పాటు చేసి, మట్టి పోసి నీళ్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేస్తే చెరువు కట్టమీదకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండడంతో పాటు సుందరీకరణకు ఒక అడుగు ముందుకు పడినట్లు ఉంటుంది.
నిధులు మంజూరైతే పనులు చేపడతాం
తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణకు అవసరమైన బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.80 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్‌శాఖ ఏఈ అనురాధ తెలిపారు. నిధులు మంజూరైతే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని ఆమె చెప్పారు. కాగా ఐదున్నరేళ్లుగా నిధుల కోసం ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పారు.