ప్రైవేటు వాహనాల్లో ధాన్యం తరలింపు

ABN , First Publish Date - 2023-06-01T00:31:30+05:30 IST

అకాల వర్షాలతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో విసిగిపోయిన రైతులు అదనంగా చెల్లిస్తూ ప్రైవేటుగానే వాహనాలను ఏర్పాటుచేసుకున్న ఘటన మండలంలో వెలుగుచూసింది.

 ప్రైవేటు వాహనాల్లో ధాన్యం తరలింపు
రావెల్లి కొనుగోలు కేంద్రంలో ప్రైవేటు లారీలో ధాన్యాన్ని లోడ్‌ చేస్తున్న రైతులు

తూప్రాన్‌, మే 31: అకాల వర్షాలతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో విసిగిపోయిన రైతులు అదనంగా చెల్లిస్తూ ప్రైవేటుగానే వాహనాలను ఏర్పాటుచేసుకున్న ఘటన మండలంలో వెలుగుచూసింది. రైతుల ఆందోళనలతో టోల్‌గేట్‌ వద్ద వాహనాల కోసం అధికారులకు సైతం పడిగాపులు తప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్‌ మండలంలో ఇటీవల రోజూ కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు రాకపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకోపోతున్నాయి. తూప్రాన్‌ మండలంలో మంగళవారం ఉదయం, బుధవారం మధ్యాహ్నం వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లోని ఽధాన్యం తడిసిపోయింది. ధాన్యం రవాణా చేసేందుకు లారీలు లభించకపోవడంతో తహసీల్దారు, రవాణశాఖ అధికారులు టోల్‌ప్లాజా వద్ద లారీలను ఆపి పంపించాల్సివస్తున్నది. తూప్రాన్‌ పట్టణ పరిధి రావెల్లి కొనుగోలు కేంద్రం వద్ద లారీలు రాకపోవడంతో రైతులు ప్రైవేటుగా లారీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో బస్తాకు రూ. 15 (క్వింటాల్‌కు రూ. 37.50) అదనంగా చెల్లింపులు చేశారు. వాతావరణంలో మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-06-01T00:31:30+05:30 IST