ట్రెయిన్‌ నంబర్‌ 07483

ABN , First Publish Date - 2023-10-02T23:53:04+05:30 IST

సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు తొలి ప్యాసింజర్‌ రైలు నేడు బయల్దేరనున్నది. 07483 నంబరు గల ఈ ట్రెయిన్‌ను ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్‌లో వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సాయంత్రం 3గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు.

ట్రెయిన్‌ నంబర్‌ 07483
రైలు

నేటి నుంచే సిద్దిపేట-సికింద్రాబాద్‌కు రైలు

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సిద్దిపేటలో జెండా ఊపనున్న మంత్రి హరీశ్‌రావు

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు2: సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు తొలి ప్యాసింజర్‌ రైలు నేడు బయల్దేరనున్నది. 07483 నంబరు గల ఈ ట్రెయిన్‌ను ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్‌లో వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సాయంత్రం 3గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైనులో భాగంగా తొలి ప్యాసింజర్‌ రైలు అందుబాటులోకి రానున్నది. బుధవారం నుంచి ఉదయం 6.45 గంటలకు, మధ్యాహ్నం 2.05 గంటలకు సిద్దిపేట నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. సిద్దిపేట నుంచి గజ్వేల్‌, మనోహరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి మీదుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో ఉదయం 10.35 గంటలకు, సాయంత్రం 5.45 గంటలకు సిద్దిపేటకు రైలు బయల్దేరేలా సమయాన్ని నిర్ణయించారు.

రూ.60కే హైదరాబాద్‌కు

ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌ వెళ్లాలంటే టికెట్‌ ధర రూ.160 ఉంది. రైలు టికెట్‌ ధర కేవలం రూ.60గా నిర్ణయించారు. రూ.350 చెల్లిస్తే నెలవారీ రైలు పాస్‌ జారీ చేస్తారు. ప్రస్తుతం డీజిల్‌ ఇంజన్‌తో నడిచే రైళ్లను నడుపుతున్నందున హైదరాబాద్‌కు వెళ్లాలంటే 3 గంటల సమయం పడుతుంది. రాబోవు రోజుల్లో ఈ లైనును ఎలక్ర్టికల్‌తో అనుసంధానం చేయడం వల్ల కేవలం గంటన్నరలోనే హైదరాబాద్‌కు చేరుకోవచ్చు

నెరవేరిన ఆకాంక్ష

సిద్దిపేట నుంచి రైలు సౌకర్యం ఉండాలని దశాబ్దాల కాలంగా డిమాండ్‌ ఉంది. తెలంగాణ ఏర్పాటు కావడం, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, కీలక మంత్రిగా హరీశ్‌రావు ఇదే ప్రాంతవాసులు కావడంతో రైలు సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే 2016లో ఈ రైల్వేలైనుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ వెనువెంటనే భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ల నిర్మాణ పనులు, ఇతర అడ్డంకులను అధిగమించడంలో మంత్రి హరీశ్‌రావు చొర వ చూపించారు. ఎట్టకేలకు దక్షిణ భారతదేశ రైల్వేపటంపై సిద్దిపేటకు చోటుదక్కింది.

Updated Date - 2023-10-02T23:53:04+05:30 IST