సిద్దిపేట, సిరిసిల్లకు నీళ్లిచ్చేలా..

ABN , First Publish Date - 2023-06-01T00:21:45+05:30 IST

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ల ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

సిద్దిపేట, సిరిసిల్లకు నీళ్లిచ్చేలా..
తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామశివారులో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌

రెండు జిల్లాలకు గోదావరి జలాలను తరలించడమే లక్ష్యం

మల్లన్నసాగర్‌ డిస్ర్టిబ్యూటరీ కాలువతో లక్షా 25వేల ఎకరాలకు సాగునీరు

నాలుగు నియోజకవర్గాల్లోని 80 గ్రామాల రైతులకు లబ్ధి

కాలువ నిర్మాణం కోసం భూసేకరణను వేగవంతం చేసిన అధికారులు

తొగుట, మే31: మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ల ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందుకోసం అఽధికారులు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ 12వ ప్యాకేజీలో 46.6కిలోమీటర్ల పొడవున నిర్మించిన ప్రధాన కాలువ ద్వారా ఇప్పటికే రెండు జిల్లాల్లోని 91 చెరువులు, కుంటలకు గోదావరి నీటిని నింపి రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మల్లన్నసాగర్‌ ప్రధాన కాలువ నుంచి 105 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ కాలువ నిర్మాణం తొందరగా పూర్తయితే గొలుసుకట్టు ద్వారా 257 చెరువులు, కుంటలలోకి నీరు చేరి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సస్యశ్యామలంగా మారే అవకాశమున్నది. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి మండలాలలో 66,423 ఎకరాలు, సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు మండలాలలో 35,058 ఎకరాలు, గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో 1,543 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజక వర్గంలోని ముస్తాబాద్‌, గంభీర్‌రావుపేట మండలాల్లో 21,976 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. దాంతో ఆయా మండలాల్లోని 80 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రధాన కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం మాదిరిగా డిస్ట్రిబ్యూటరీ కాలువలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం అందిస్తే భూసేకరణ వేగవంతమయ్యే అవకాశముంది, ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు పలు దఫాలుగా రైతులతో చర్చించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలు వారికి వివరిస్తూ భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. కాలువ నిర్మాణానికి 1845 ఎకరాల భూమి అవసరముండగా ఇప్పటివరకు 682 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. రెండేళ్లలో దాదాపు పనులు పూర్తయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి.

ప్రతి ఎకరాకు నీళ్లందించడమే లక్ష్యం

- డీఈ శ్రీనివా్‌సరావు

మల్లన్నసాగర్‌ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మెయిన్‌ కెనాల్‌ కాకుండా డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌, పిల్ల కాల్వల ద్వారా ఎత్తు ప్రాంతంలో ఉన్న రైతుల భూములకు కూడా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం ఇప్పటికే 50 శాతం భూసేకరణ పూర్తి చేశాం. మిగతా రైతులు భూసేకరణకు తొందరగా ముందుకొస్తే డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌లు, పిల్లకాల్వలు పూర్తిచేసి సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోని లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి వీలవుతుంది.

Updated Date - 2023-06-01T00:21:45+05:30 IST