కొత్తది ఇవ్వమంటే ఉన్నది మార్చారు!

ABN , First Publish Date - 2023-03-31T00:29:20+05:30 IST

సంగారెడ్డిలో ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లా రిజస్ట్రార్‌ కార్యాలయాన్ని పటాన్‌చెరుకు మార్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి.

కొత్తది ఇవ్వమంటే ఉన్నది మార్చారు!

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ తరలింపుపై వివాదం

పటాన్‌చెరుకు ఉమ్మడి మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి 30: సంగారెడ్డిలో ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లా రిజస్ట్రార్‌ కార్యాలయాన్ని పటాన్‌చెరుకు మార్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం విభజన జరగలేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రంగా కొనసాగినప్పటి నుంచి సంగారెడ్డిలోనే ఉన్న జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం కొనసాగుతున్నది. దీనని పటాన్‌చెరుకు మారుస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రమైన పటాన్‌చెరుకు తరలించడమేంటని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయం సంగారెడ్డి సమీపంలోని కాశీపూర్‌లోని సువిశాలమైన స్థలంలో సొంత భవనంలో ఉంది. పటాన్‌చెరుకు మారిస్తే అద్దె భవనంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధి కావడంతో అద్దె కూడా భారీగానే ఉండే అవకాశముంది.

అడిగిందొకటి.. జరిగిందొక్కటి!

నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరులో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేశారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతాయని, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం స్థానికంగానే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి బదులు సంగారెడ్డి నుంచి జిల్లా కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించింది.

గందరగోళంగా పునర్విభజన

సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధి పుననర్విభన పైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటవుతున్న పటాన్‌చెరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోకి పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం మండలాలను మాత్రమే చేర్చారు. ప్రస్తుతం సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో ఉన్న సంగారెడ్డి, కంది, గుమ్మడిదల, జిన్నారం మండలాలు అలాగే ఉంచారు. ఎమ్మెల్యే పటాన్‌చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కలిపి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పటాన్‌చెరులో ఏర్పాటు చేయాలని కోరారు. కానీ తాజా ఉత్తర్వుల్లో నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం మండలాలను సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోనే కొనసాగించడంపై ప్రజలు మండిపడుతున్నారు. పటాన్‌చెరు పక్కనే ఉన్న ప్రాంతాలను ఎక్కడో దూరంగా ఉన్న సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఉంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక భారం పడకూడదనే..

పటాన్‌చెరులో కొత్తగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి భారం పడుతుంది. అందుకే సంగారెడ్డిలో ఉన్న ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని పటాన్‌చెరుకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే ప్రత్యేకంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లలో ఒకరిని పటాన్‌చెరుకు బదిలీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే సిబ్బందిని కూడా సంగారెడ్డి కార్యాలయం నుంచి బదిలీపై పంపించనున్నారు.

వచ్చే నెలలో కొలిక్కి

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సంగారెడ్డి నుంచి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం తరలింపు ప్రక్రియ పూర్తవడానికి మరో నెల సమయం పట్టే అవకాశం ఉన్నది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యాదర్శి ఉత్తర్వులు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఇంకా అందలేదని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వులు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు వస్తే అక్కడి నుంచి డీఐజీకి, ఆయన నుంచి తమకు వస్తాయని పేర్కొన్నాయి. తదనంతరం పటాన్‌చెరులో భవనాన్ని ఎంపిక చేసి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం మార్చడం జరుగుతుందని వివరించాయి.

Updated Date - 2023-03-31T00:29:20+05:30 IST