రైతన్నకు కొండంత అండ

ABN , First Publish Date - 2023-06-02T23:51:28+05:30 IST

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు.

రైతన్నకు కొండంత అండ

మూడురెట్లు పెరిగిన ధాన్యం ఉత్పత్తి

80,039 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ

మునిపల్లిలో నీరా కలెక్షన్‌ సెంటర్‌

హోంమంత్రి మహమూద్‌అలీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంగారెడ్డి, జూన్‌ 2 : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆయన సంగారెడ్డి కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపం నివాళులర్పించారు. అనంతరం నగారా మోగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌, మద్దతుధరకు సేకరణ తదితర పథకాలతో విత్తనం వేసుకునే దగ్గరి నుంచి పంట కొనుగోలు దాకా అడుగడుగునా రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పారు. రైతులకు చార్జీలు లేకుండా కరెంట్‌, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. 2014-15లో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు కాగా... 2022-23 నాటికి 8 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి మూడురెట్లు పెరిగిందని తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటి వరకు 36వేల మంది రైతుల నుంచి 1.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.386 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లాలోని పటాన్‌చెరు మండలంలోని చిట్కుల్‌, కర్దనూర్‌, రామేశ్వరం బండ, కంది మండలం ఎద్దుమైలారం గ్రామపంచాయతీలకు ఐఎస్‌వో గుర్తింపు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీరెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, హెచ్‌డీసీ చైర్మన్‌ చింతాప్రభాకర్‌, జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే, సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.రమణకుమార్‌ జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ టి.ఉషావిశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:51:28+05:30 IST