నాలుగేళ్లయినా పూర్తికాని బ్రిడ్జి నిర్మాణం
ABN , First Publish Date - 2023-01-01T22:57:45+05:30 IST
అధ్వానంగా బ్రిడ్జి నిర్మాణం కోసం వదిలేసిన రోడ్డు
రేగోడు, జనవరి 1: మండల కేంద్రాలను కలుపుతూ రెండు లైన్ల రోడ్డు వెయ్యాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి కావడం లేదు. రేగోడు మీదుగా పోచారం - పెద్ద శంకరంపేట వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం రూ.16 కోట్లు మంజూరయ్యాయి. కొత్వాల్‌పల్లి, రేగోడు - మర్పల్లి మధ్య బ్రిడ్జిల నిర్మాణం కోసం అదనపు నిధులతోపాటు టెండర్లను వేశారు. రోడ్డు నిర్మాణంతో పాటు కొత్వాల్‌పల్లి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ రేగోడు - మర్పల్లి మధ్య నిర్మించాల్సిన బ్రిడ్జి టెండర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. నాలుగు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని వాపోతున్నారు. వాహనాలు బోల్తా పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం వదిలేసిన రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవలే స్థానిక పోలీసులు, మర్పల్లి సర్పంచ్ సిద్ధారెడ్డి సహకారంతో గుంతల్లో మొరం వేయించారు. బ్రిడ్జి నిర్మాణానికి రెండుసార్లు టెండర్ వేసినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు.