చేర్యాల పెద్దచెరువు వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-06-26T00:15:35+05:30 IST
చేర్యాల, జూన్ 25: చేర్యాల పెద్దచెరువు మత్తడి ఆవరణలోని వివాదాస్పద స్థలాన్ని మునిసిపాలిటీకి అప్పగించేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి ఆదివారం వస్తున్నట్లు తెలపడంతో బీఆర్‌ఎస్, ప్రతిపక్షాల నేతలు, స్థానికులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు తుల్జా భవానీరెడ్డి షాక్
మత్తడి స్థలాన్ని మునిసిపాలిటీకి అప్పగించనున్నట్లు వెల్లడి
వివాదాస్పద స్థల ఫెన్సింగ్ కూల్చివేత
బాండ్ రాసి ఇవ్వాలన్న మునిసిపల్ వైస్ చైర్మన్
పలువురి వాగ్వాదం
బాణసంచా కాల్చి హర్షం వెలిబుచ్చిన ప్రతిపక్షాలు
చేర్యాల, జూన్ 25: చేర్యాల పెద్దచెరువు మత్తడి ఆవరణలోని వివాదాస్పద స్థలాన్ని మునిసిపాలిటీకి అప్పగించేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి ఆదివారం వస్తున్నట్లు తెలపడంతో బీఆర్‌ఎస్, ప్రతిపక్షాల నేతలు, స్థానికులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ కూల్చివేయించారు. తన తండ్రి తప్పు చేశాడని, నన్ను క్షమించ డని ప్రాథేయపడ్డారు. కోర్టు ద్వారా మునిసిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రజల సమక్షంలో వెల్లడించారు. స్థలాన్ని మునిసిపాలిటీకి ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చుతున్నామని, బాండ్ రాసివ్వాలని మునిసిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి తదితరులు కోరడంతో ఆమె నిరాకరించారు. తాను కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపింది. ఈ విషయమై బండి సుదర్శనం, పచ్చిమడ్ల వెంకటయ్య తదితరులు తుల్జా భవానీరెడ్డి వచ్చాక బాండ్ రాసిఇవ్వాలని అడగడం సబబు కాదని, ఇన్నిరోజుల నుంచి ఎక్కడికి వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, రైతులు ఆందోళన చేపట్టి ఫెన్సింగ్ కూల్చి వేయించినందుకు 33 మందిపై కేసు నమోదైంది. ప్రస్తుతం తుల్జా భవానీరెడ్డి అంగీకరించడంతో స్థానికులు ఫెన్సింగ్ కూల్చివేయడం, అధిక సంఖ్యలో జనాలు గుమిగూడటం, బీఆర్‌ఎస్ నేతలే వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నది. దీంతో పోలీసులు చేరుకుని పంపించి వేశారు. కాగా తుల్జా భవానీరెడ్డి ప్రకటనను స్వాగతించినట్లు మునిసిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి పేర్కొన్నారు.
బాణసంచా కాల్చి ప్రతిపక్షాల హర్షం
మత్తడి ఆవరణ స్థలాన్ని అప్పగించడం పట్ల ప్రతిపక్ష నాయకులు హర్షం వెలిబుచ్చుతూ పాతబస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి హర్షం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీరు పట్ల కన్న కూతురే ఆగ్రహించే పరిస్థితి నెలకొన్నదని, చేర్యాలకు మంచిరోజులు రాబోతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో గుణ పాఠం తప్పదన్నారు. వత్తాసు పలికిన బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆముదాల మల్లారెడ్డి, కొమ్ము నర్సింగరావు, అవుశర్ల యాదయ్య, పుర్మ ఆగంరెడ్డి, బూరుగు సురేశ్, కాశెట్టి పాండు, ఒగ్గు రాజు, కూరారం బాలనర్సయ్య, అందె బీరయ్య, అందె అశోక్, దాసరి ప్రశాంత్, రాగుల శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.