శాంతితో అలరారుతున్న తెలంగాణ

ABN , First Publish Date - 2023-09-18T00:09:07+05:30 IST

సిద్దిపేటకు రైలు రావడం గర్వంగా ఉంది జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌

శాంతితో అలరారుతున్న తెలంగాణ
కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 17: స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయిందని, పచ్చని పొలాలు, మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతు, సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ప్రగతిబాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణా జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, పద్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటం చేసి తెలంగాణను సాధించారని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణతోనే సిద్దిపేట జిల్లా ఏర్పడిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని చెప్పారు. ప్రత్యేక తెలంగాణతోనే సిద్దిపేటకు రైలు రావడం గర్వంగా ఉన్నదని మంత్రి అన్నారు. సిద్దిపేట జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతోపాటు ప్రగతిశీల విజయాలను సాకారం చేసుకున్నామని మంత్రి తెలిపారు. సాగునీటి రిజర్వాయర్లతో జిల్లాను వాటర్‌ హబ్‌గా మార్చామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉన్న ఈ ప్రాంతం నేడు అగ్రికల్చర్‌ హబ్‌గా, ఆదర్శవంతమైన పంటలకు చిరునామాగా తయారైందని చెప్పారు. ఆలయాలకు, అధ్యాత్మికతకు పెద్దపీట వేయడంతో టెంపుల్‌హబ్‌గా, పర్యాటక కేంద్రాలను గుర్తించడంతో టూరిజంహబ్‌గా, సకల క్రీడా వసతులతో స్పోర్ట్స్‌హబ్‌గా, ఐటీహబ్‌గా, మెడికల్‌హబ్‌గా అగ్రస్థానంలో నిలబెట్టుకున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

కేసీఆర్‌ పథకం లేని ఇల్లు ఉండదు

ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని రెండు కండ్లుగా చేసుకొని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సవ్యమైన దిశను ఆచరిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సబ్బండ వర్గాల సంతోషం, సంతృప్తిని కాంక్షిస్తూ తెలంగాణ సర్కారు తలపెట్టిన ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పన, కుల వృత్తులకు ప్రొత్సహించే పథకాలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు.. కేసీఆర్‌ పథకం లేని ఇల్లు ఉండదు అనే స్థాయిలో గడపగడపకూ సంక్షేమాన్ని విస్తరించిన ఘనత బీఆర్‌ఎ్‌సకు దక్కిందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్‌, శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్వో నాగరాజమ్మ, ఏసీపీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జాతీయ జెండాను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ ఎగురవేశారు.

Updated Date - 2023-09-18T00:09:07+05:30 IST