కిర్బీ పరిశ్రమ ఉద్యోగి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2023-06-07T00:07:20+05:30 IST

కనబడకుండా పోయిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం కిర్బీ పరిశ్రమ ఉద్యోగి రైలు కిందపడి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కిర్బీ పరిశ్రమ ఉద్యోగి అనుమానాస్పద మృతి

గత నెల 31న మిస్సింగ్‌

రైల్వే ట్రాక్‌పై చిద్రమైన మృతదేహం లభ్యం

అధికారుల వేధింపులే కారణమని పరిశ్రమ ఎదుట బంధువుల ఆందోళన

పటాన్‌చెరు రూరల్‌, జూన్‌ 6: కనబడకుండా పోయిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం కిర్బీ పరిశ్రమ ఉద్యోగి రైలు కిందపడి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిర్బీ ఉద్యోగి సతీష్‌(44) గత నెల 31న విధులకు హాజరై ఇంటికి తిరిగివెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 1న బీడీఎల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీకెమెరాలను పరిశీలించగా అదే రోజు లింగంపల్లి వద్ద బస్‌ దిగి తెల్లాపూర్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. కాగా ఒకటో తేదీన ఉదయం తెల్లాపూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం చిద్రమైన స్థితిలో లభించింది. వికారాబాద్‌ రైల్వే పోలీసులు మృతదేహనికి పంచనామా నిర్వహించి పత్రికల ద్వారా వివరాలు వెల్లడించారు. ఎవరూ రాకపోవడంతో నాలుగు రోజుల అనంతరం ఖననం చేశారు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వికారాబాద్‌ పోలీసులను ఆశ్రయించి ఫొటో ఆధారంగా మృతుడిని సతీ్‌షగా గుర్తించారు. దీంతో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాజమాన్యం వేధింపుల కారణంగానే సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మంగళవారం కుటుంబ సభ్యులు మృతదేహంతో కిర్బీ పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యజమాన్యం స్పందించి సతీష్‌ కుటుంబాన్ని ఆదుకోవడానికి అంగీకరించడంతో బంధువులు ఆందోళన విరమించారు.

Updated Date - 2023-06-07T00:07:20+05:30 IST