ధరణి పోర్టల్‌లో కనిపించని సర్వే నంబర్లు
ABN , First Publish Date - 2023-02-27T23:56:00+05:30 IST
తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములివ్వగా రైతుల పాసుబుక్కుల్లో నుంచి ముంపునకు గురికాని భూములను సైతం ధరణి పోర్టల్ నుంచి తొలగించారు.
తోటపల్లి భూనిర్వాసితులకు కొత్త కష్టాలు
ముంపు భూమితో పాటు మిగతా భూమి రికార్డుల నుంచి తొలగింపు
రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు
తమ పరిధిలో లేదంటున్న తహసీల్దార్
బెజ్జంకి, ఫిబ్రవరి 27 : తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములివ్వగా రైతుల పాసుబుక్కుల్లో నుంచి ముంపునకు గురికాని భూములను సైతం ధరణి పోర్టల్ నుంచి తొలగించారు. రికార్డుల్లో తమ భూములు కనిపించకుండా పోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. భూ రికార్డులను సరిచేయాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి మొరపెట్టుకుంటే తమ పరిధిలోని అంశం కాదని చెబుతుండడం గమనార్హం.
ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2007లో శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం గాగిల్లాపూర్, తోటపల్లి, కోహెడ మండలంలోని రామచంద్రాపూర్, వరి కోలు నారాయణపూర్, గొట్లమిట్ల, చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామాల్లోని రైతుల నుంచి ఎకరాకు రూ.2.10 లక్షల పరిహారం చెల్లించి సుమారుగా 1603 ఎకరాల భూములను సేకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బెజ్జంకి మండలంలో 49వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దుచేసి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చింది.
ముంపులో భూమిని తీసేసే క్రమంలో
బెజ్జంకి మండలంలోని గ్రామాల్లో ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే పలు సర్వే నంబర్‌లలోని భూములకు పాస్‌బుక్కులు అలాగే ఉన్నాయి. వాటికి రైతుబంధు కూడా వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నదాని కంటే ఎక్కువ రైతులకు రైతుబంధు వెళ్తుందని గుర్తించిన అధికార యంత్రాంగం ముంపుగ్రామాలైన గాగిల్లాపూర్, తొటపల్లితో పాటు ఇతర గ్రామాల్లో ముంపునకు గురైన భూముల రికార్డులను నీటిపారుదల శాఖ అధికారులు నుంచి తెప్పించుకొని వాటిని రైతుల పాసుబుక్కుల నుంచి తొలగించారు. అదే క్రమంలో మిగతా సర్వే నంబర్లనూ రికార్డుల నుంచి తొలగించారు. దీంతో ధరిణి పోర్టల్‌లోని రికార్డుల్లో సర్వే నంబర్లు మాయం అయ్యాయి. ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఏమైందో తెలియక రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
వేలల్లో దరఖాస్తు రుసుం
ఆన్‌లైన్‌లో తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ అధికారులను సమస్య విన్నవించగా ముంపు సర్వే నంబర్‌లలో పోయిన భూమిని మాత్రం తొలగించామని మిగతావి ఎలా తొలిగిపోయాయో తమకు సంబంధం లేదని సమాధానం వచ్చింది. తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరగా మిస్సింగ్ సర్వే నంబర్ కింద మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. అయితే సదరు రైతులు రూ.1000 నుంచి రూ.1500 ఖర్చుపెట్టుకొని మీ సేవలో దరఖాస్తులు చేసుకోక తప్పడం లేదు.
ఎలా తొలగిస్తారు ?
రైతుల పాసుబుక్కుల నుంచి భూమిని వారికి తెలియకుండా, కనీస నోటీసు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాసుబుక్కుల్లో ఎక్కువగా ఉన్న ముంపులో పోయిన భూమిని తీసేయాలి కానీ దానికి సంబంధం లేని భూములను ఎలా తొలగిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముంపు భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించడానికి సంబంధిత శాఖ అధికారులు బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారులకు పంపారు. ధరణి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే క్రమంలోనా లేదా అధికారుల నిర్లక్ష్యం మూలంగానా మొత్తానికి ప్రాజెక్టు చుట్టుపక్కల సర్వే నంబర్లు తొలగించబడ్డాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రాజెక్టు కింద కోల్పోయిన భూములు కాకుండా ఉన్న భూములను అయినా పాస్‌బుక్కుల్లో ఎక్కించాలని రైతులు కోరుతున్నారు. ధరణి రికార్డుల్లో నుంచి సర్వే నంబర్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
1.12 ఎకరాలను తొలగించారు
నా పాసుబుక్కుల్లో 1.10 ఎకరాల భూమి ముంపులో పోయింది. కానీ ఇటీవల ముంపు భూమిని పాసుబుక్కులో నుంచి తొలగిస్తామని చెప్పి మొత్తం 2.22 గుంటలు తొలగించారు. సర్వే నంబర్లు ధరణిలో రావడమే లేదు. అదనంగా 1.12 గుంటలు తీసేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నాం. నా భూమిని నాకు ఇప్పించి రికార్డుల్లో తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
-సురుకొంటి విజయ, గాగిల్లాపూర్ రైతు
మాకు సంబంధం లేదు
మేము ఇటీవల గాగిల్లాపూర్, తోటపల్లితో పాటు ముంపు గ్రామాల్లో రికార్డులను పరిశీలించి వారి పాస్‌బుక్కుల నుంచి ప్రాజెక్టుకు చెందిన భూములను మాత్రమే తొలగించాం. కానీ ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లు కనిపించడం లేదని రైతుల ద్వారా తెలిసింది. మిస్సింగ్ సర్వే నంబర్ కింద మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ధరణి పోర్టల్ నుంచి రికార్డులు తొలగించడం మాకు సంబంధం లేదు.
- తహసీల్దార్ విజయ్ ప్రకా్‌షరావు, బెజ్జంకి