సు‘జల’హారం

ABN , First Publish Date - 2023-02-21T00:23:54+05:30 IST

నాలుగు దశాబ్దాల ముందుచూపుతో సిద్దిపేట ప్రాంత శాశ్వత తాగునీటి సమస్యలను తరిమి కొట్టడానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మానేరు నుంచి పైపులైను ద్వారా సిద్దిపేట పట్టణానికి తాగునీరు సరఫరా అవుతున్నది.

సు‘జల’హారం
సిద్దిపేట పట్టణం చుట్టూ నిర్మించే వాటర్‌ రింగ్‌మేన్‌ నిర్మాణాన్ని సూచించే మ్యాప్‌

సిద్దిపేట చుట్టూ వాటర్‌ రింగ్‌మేన్‌

మల్లన్నసాగర్‌ నుంచి తాగునీటి సరఫరా

నాలుగు దశాబ్దాల ముందుచూపుతో ప్రణాళిక

ప్రతీరోజు 43.5 మిలియన్‌ లీటర్ల నీటి తరలింపు

నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి,సిద్దిపేట, ఫిబ్రవరి 20 : నాలుగు దశాబ్దాల ముందుచూపుతో సిద్దిపేట ప్రాంత శాశ్వత తాగునీటి సమస్యలను తరిమి కొట్టడానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మానేరు నుంచి పైపులైను ద్వారా సిద్దిపేట పట్టణానికి తాగునీరు సరఫరా అవుతున్నది. దీనికి ఆర్థికభారంతో పాటు భవిష్యత్‌ తరాలకు ఈ నీటిసరఫరాతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పట్టణ సమీపంలో ఉన్న 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి స్వచ్ఛమైన గోదావరి జలాలను తరలించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ప్రతిష్ఠాత్మక పథకానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు.

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తికావడంతో అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగోల్‌ వద్ద ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ధిచేసి సమీప లకుడారం జంక్షన్‌ వద్ద నిర్మించిన గ్రౌండ్‌లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కి తరలిస్తారు. 590 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 490 మీటర్ల డౌన్‌లో ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీకి గ్రావిటీ (ప్రవాహం) ద్వారా నీళ్లు వచ్చేలా ఇంజనీర్లు రూపకల్పన చేశారు. కొమురవెల్లి కమాన్‌ నుంచి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని బాబూ జగ్జీవన్‌రామ్‌ సర్కిల్‌ వరకు 23 కిలోమీటర్ల మేర 800ఎంఎం డయా పైపులైను వేయనున్నారు. ఇక్కడి నుంచి రంగధాంపల్లి అమరవీరుల స్థూపం, నర్సాపూర్‌ జంక్షన్‌, వేములవాడ కమాన్‌ మీదుగా సిరిసిల్ల రోడ్డులోని ఎల్లమ్మ ఆలయం మీదుగా ముస్తాబాద్‌ రోడ్డు వెళ్లే నాగదేవత ఆలయం వరకు, తిరిగి అక్కడి నుంచి కాళ్లకుంట కాలనీ నుంచి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకూ, మళ్లీ అక్కడి నుంచి బీజేఆర్‌ సర్కిల్‌ వరకు ఒక హారంలా ఈ వాటర్‌ పైపులైన్‌ రింగ్‌ మేన్‌ను నిర్మించనున్నారు. అధిక మన్నిక ఉండేలా 700 ఎం.ఎం డయాపైపు లైను చేపట్టనున్నారు. ప్రతీ జంక్షన్‌లోనూ ట్యాపింగ్‌ ఇవ్వనున్నారు.

43.5మిలియన్‌ లీటర్ల నీరే టార్గెట్‌

ప్రస్తుతం సిద్దిపేట పట్టణ జనాభా 1లక్షా 46వేల మంది ఉండగా మరో పదేళ్లకు 2లక్షల 26వేలు, మరో 40 ఏళ్లకు అంటే 2063 సంవత్సరానికి 3లక్షలపైచిలుకు జనాభా దాటుతుందని అంచనా వేశారు. ప్రస్తు తం సిద్దిపేటకు ప్రతీరోజు 20 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం పడుతున్నది. మరో 30ఏళ్ల భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరాలంటే 40 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటిసరఫరా వ్యవస్థ ఉండాలని నిర్ణయించారు. అందుకే ఇకపై ప్రతీరోజు 43.5మిలియన్‌ లీటర్ల నీటిని అందుబాటులో ఉంచేలా మల్లన్నసాగర్‌తో అనుసంధానం చేయనున్నారు.పట్టణంలో అదనంగా మరో నాలుగు భారీస్థాయి మంచినీటి ట్యాంకులు నిర్మించాలని ప్రతిపాదించారు.

ఇది శాశ్వత పరిష్కారం

- హరీశ్‌రావు, మంత్రి

సిద్దిపేట ప్రజలకు మూడు చిరకాల కోరికలు ఉండేవి. ఒకటి జిల్లా కేంద్రం, రెండోది రైలు, మూడోది సాగునీరు. ఈ మూడు కూడా సీఎం కేసీఆర్‌ సహకారంతో నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. సిద్దిపేటలో రైల్వేస్టేషన్‌ నిర్మిస్తున్నాం. ఆర్నేళ్లలో రైలు కూడా వస్తుంది. ఇక తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని బాగా ఆలోచించి కొన్ని ఆటంకాలు ఎదురైనా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 40 ఏళ్ల వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Updated Date - 2023-02-21T00:23:55+05:30 IST