సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-02-04T00:13:00+05:30 IST
సిద్దిపేట రింగు రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌బీ అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ప్రగతి పనుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటలో కంటి వెలుగు కేంద్రం సందర్శన
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 3 : సిద్దిపేట రింగు రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌బీ అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట జిల్లా సమగ్ర ప్రగతి పనులు, జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు మార్చి నెలలోపు 40 కిలోమీటర్లు, మిగిలిన 15 కి.మీ. మేనెలలోపు పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. గజ్వేల్ రింగురోడ్డు పనుల ప్రగతిపై చర్చించి, మార్చి నెలలోపు యుద్ధప్రాతిపదికన మొత్తం పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. సిద్దిపేట పట్టణం నుంచి ఎన్సాన్‌పల్లికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులలో జాప్యం జరుగుతోందని త్వరితగతిన పనులు చేపట్టాలని ఆదేశించారు. తడ్కపల్లి, మెట్టు వద్ద జరుగుతున్న ప్రమాదాలు తమ దృష్టికి వచ్చాయని, నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట బీవీఏస్‌వీ వెటర్నరీ కళాశాల అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఫోన్‌లైనులో ఆదేశించారు. సిద్దిపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి నిర్మాణ పనులపై సమీక్షించారు.
రీడింగ్ కళ్లద్దాలను వెంటనే అందజేయాలి
సిద్దిపేట పట్టణంలోని 43వ వార్డులో బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. కంటి వెలుగులో భాగంగా పరీక్షలు నిర్వహించుకుని అవసరమయ్యే వారికి వెంటనే రీడింగ్ కళ్లద్దాలను పంపిణీ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.