వడివడిగా..

ABN , First Publish Date - 2023-04-17T00:09:56+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్‌ఈడీపార్కులో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది.

వడివడిగా..

శివానగర్‌ ఎల్‌ఈడీపార్కులో ప్రారంభమైన పరిశ్రమల స్థాపన

టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో పూర్తయిన మౌలిక వసతుల కల్పన

నిర్మాణ పనులు ప్రారంభించిన పలు సంస్థలు

జిన్నారం, ఏప్రిల్‌ 16: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్‌ఈడీపార్కులో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. జిన్నారం మండలం శివానగర్‌లో టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో 6 సంవత్సరాల క్రితం ఎల్‌ఈడీపార్కు ఏర్పాటు కోసం భూసేకరణ చేపట్టారు. మౌలిక సౌకర్యాల కల్పన, భూముల అభివృద్ధి అనంతరం రెండేళ్ల క్రితం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశారు. కానీ పరిశ్రమల రాక ఆలస్యమవుతుండడంతో పారిశ్రామికవాడ ఏర్పాటుపై సందేహాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో స్థలాలు పొందిన నాలుగు సంస్థలు పరిశ్రమల నిర్మాణ పనులు జోరుగా చేస్తుండడంతో ఆశలు చిగురించాయి.

125 ఎకరాల సేకరణ

జిన్నారం మండలం శివానగర్‌ సర్వేనంబర్‌ 114లో ఎల్‌ఈడీపార్కు ఏర్పాటు కోసం రైతుల నుంచి 125 ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించారు. ఎల్‌ఈడీ బల్బులు తయారుచేసే 50 పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి వసతులు కల్పించారు. విశాలమైన బీటీరోడ్లు, విద్యుత్‌ సరఫరా, డ్రైనేజీ, వాననీటి ప్రవాహం కోసం సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పార్కుకు వెళ్లేందుకు శివానగర్‌, కొడకంచి గ్రామాల వైపు నుంచి ప్రధాన రహదారులు వేయాల్సి ఉన్నది. ఈ పనులు పూర్తయి రెండేళ్లవుతున్నా పరిశ్రమల ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు నిరాశ చెందారు. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలతో టీఎ్‌సఐఐసీ అధికారులు ఎల్‌ఈడీ పార్క్‌లో పలు సంస్థలకు భూ కేటాయింపులు పూర్తిచేశారు. ఇందులో కొన్ని చిన్న పరిశ్రమలు, హెల్త్‌కేర్‌ రంగాల సంస్థలకు భూములు కేటాయించినట్టు తెలుస్తున్నది. భూములుపొందిన మూడు సంస్థలు నిర్మాణ పనులు చేపడుతున్నాయి.

ఉపాధిపై ఆశలు

శివానగర్‌లో ఎల్‌ఈడీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు పనుల ప్రారంభం కావడంతో ఉపాధిపై ఆశలు చిగురిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో పరిశ్రమలు లేక ఉద్యోగాల కోసం స్థానికులు దూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఎల్‌ఈడీ పరిశ్రమల స్థాపన జరిగితే చుట్టపక్కల 15 గ్రామాల పరిధిలో 3వేల మందికి ప్రత్యక్షంగా, 1,500 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఎల్‌ఈడీ పార్కును అధికారికంగా వచ్చే నెలలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శివానగర్‌లో ఎల్‌ఈడీపార్కు ఏర్పాటుతో చుట్టపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌ పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌చే త్వరలోనే ఎల్‌ఈడీ శంకుస్థాపన చేయించేందుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2023-04-17T00:09:56+05:30 IST