ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలి
ABN , First Publish Date - 2023-02-28T23:40:12+05:30 IST
ఎంఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ
జహీరాబాద్, ఫిబ్రవరి 28: ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ కోరారు. మహాజన సోషలిస్టు పార్టీ నాయకుడు అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం మాదిగల సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రను జహీరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శివ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల సంగ్రామ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ నిరంకుశ వైఖరిని మార్చుకొని, తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. మార్చి 15న పటాన్‌చెరులో జరిగే హైదరాబాద్, ముంబై జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ మైసగళ్ల బుచ్చెంద్ర మాదిగ, కో-కన్వీనర్ చిరంజీవి మాదిగ, ఎంఎ్‌సపీ జిల్లా కన్వీనర్ పోట్టోళ్ల వెంకటేశ్, జహీరాబాద్ నాయకులు జైరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పులేగరి సుకుమార్, రాంచెందర్, అలిగె రాజు, సంగేరి మురళి, సంగేరి విజయ్, తుమ్మళ్ల యాదగిరి, దేవులపల్లి మహేష్, పొట్లగళ్ల ప్రశాంత్ పాల్గొన్నారు.