Share News

ఓటెత్తిన ఉత్సాహం

ABN , First Publish Date - 2023-12-02T00:07:20+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 76.99 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఓటెత్తిన ఉత్సాహం

మెదక్‌ జిల్లాలో 86.69 శాతం, సంగారెడ్డి జిల్లాలో 76.99 శాతం పోలింగ్‌

అత్యధికంగా నర్సాపూర్‌లో 88.10 శాతం, అందోల్‌లో 84.80 శాతం

అత్యల్పంగా పటాన్‌చెరులో 69.61 శాతం

సంగారెడ్డి జిల్లాలో పురుషులు.. మెదక్‌ జిల్లాలో మహిళల ఓటింగ్‌ ఎక్కువ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 1: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 76.99 శాతం ఓటింగ్‌ నమోదైంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 13,93,711 మంది ఓటర్లు ఉండగా 10,73,014 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా అందోల్‌ నియోజకవర్గంలో మొత్తం 2,49,248 మంది ఓటర్లకుగానూ 84.80 శాతం మేర 2,11,364 మంది ఓటు వేశారు. తక్కువగా పటాన్‌చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,97,237 మందికి గానూ 69.61 శాతంతో 2,76,510 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన నియోజకవర్గాలలో నారాయణఖేడ్‌లో 2,31,118 మంది ఓటర్లగానూ 83.23 శాతం మేర 1,92,418 మంది ఓటేశారు. అలాగే సంగారెడ్డిలో 2,45,253 మంది ఓటర్లకు గానూ 75.42 శాతంలో 1,84,974 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జహీరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,70,785 మంది ఓటర్లగానూ 76.72 శాతం మేర 2,07,748 మంది ఓటేశారు.

పురుషుల ఓటింగే ఎక్కువ

సంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే పురుషులే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. జిల్లాలో 7,24,854 మంది పురుష ఓటర్లు ఉండగా 5,46,118 మంది ఓటేశారు. అలాగే మహిళలు 6,91,099 మంది ఉండగా 5,26,839 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 128 మంది ఉండగా 57 మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే నారాయణఖేడ్‌లో పురుషులు 1,16,581 మందికి గానూ 98,805 మంది ఓటేశారు. అలాగే మహిళలు 1,14,599 మంది ఉండగా 93,610 మంది ఓటేశారు. అందోల్‌లో పురుషులు 1,22,699 మందికి గానూ 1,05,722 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు మొత్తం 1,26,543 మంది ఉండగా 1,05,642 మంది ఓటేశారు. జహీరాబాద్‌లో 1,36,523 మంది పురుష ఓటర్లకుగానూ 1,06,445 మంది, 1,34,259 మహిళా ఓటర్లకుగానూ 1,01,302 మంది ఓట్లు వేశారు. సంగారెడ్డిలో 1,21,636 మంది ఉండగా 92,898 మంది, 1,23,582 మంది మహిళలకుగానూ 92,065 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పటాన్‌చెరు నియోజకవర్గంలో పురుషులు 2,05,045 మందికి గానూ 1,42,254 మంది, మహిళలు 1,92,116 మందికి గానూ 1,34,220 మంది ఓట్లు వేశారు. ఇతరులలో నారాయణఖేడ్‌లో 8 మందికి గానూ ముగ్గురు, జహీరాబాద్‌లో ముగ్గురికి ఒకరు, సంగారెడ్డిలో 35 మందికి 17 మంది, పటాన్‌చెరులో 76 మందికి గానూ 36 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మెదక్‌ జిల్లాలో 86.69 శాతం పోలింగ్‌

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 1: మెదక్‌ జిల్లాలో 86.69 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో 4,40,341 మంది ఓటర్లు ఉండగా.. 3,81,213 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెదక్‌ నియోజకవర్గంలో మొత్తం 2,16,748 మంది ఓటర్లుండగా... 1,84,920 మంది ఓటేశారు. పురుషులు 89,685 మంది, మహిళలు 95,234 మంది, ఇతరులు ఒకరు ఓటేశారు. 85.32 శాతం పోలింగ్‌ నమోదైంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో 88.10 శాతం పోలింగ్‌ నమోదైంది. 2,23,593 మంది ఓటర్లు ఉండగా... 1,96,992 మంది ఓటు వేశారు. ఇందులో పురుషులు 97,697 మంది, మహిళలు 99,293 మంది, ఇతరులు ఇద్దరు ఓటు హక్కును వినియోగంచుకున్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళలు 1,94,527 మంది, పురుషులు 1,87,382 మంది ఓటు వేశారు.

మెదక్‌ జిల్లాలో ఓటెత్తిన ఉత్సాహం

జిల్లాలో పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా చేసిన కృషితోనే పోలింగ్‌ నమోదులో మెదక్‌ జిల్లాకు రాష్ట్రంలోనే ద్వితీయస్థానం దక్కిందని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం టీఎన్జీవోలు కలెక్టర్‌ రాజర్షిషాకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. అనంతరం నరేందర్‌ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రజలకు వివరిస్తూ.. ఓటర్లతో చైతన్యం తెచ్చేలా వివిధ కార్యక్రమాలను చేపట్టిన్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ఈవీఎం, వీవీప్యాట్లుపై అవగాహన కల్పించారన్నారు. పోలింగ్‌ శాతం నమోదులో రాష్ట్రంలోనే జిల్లాను రెండోస్థానంలో నిలపడంతో అభినందనీయమన్నారు. పోలింగ్‌ పెరగడానికి కృషిచేసిన జిల్లా అధికార యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనవెంట జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, జిల్లా ఉపాధ్యక్షుడు ఇక్బాల్‌పాషా, శంకర్‌, యూనిట్‌ కార్యదర్శి రామాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-02T00:07:22+05:30 IST