Share News

ఎమ్మెల్యే మనోడైనా.. ప్చ్‌..

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:13 AM

ఎమ్మెల్యే తమవారైతే చాలు కార్యకర్తల జోరు అంతా.. ఇంతా కాదు. అయితే ఎమ్మెల్యే తమ వాడే అయినా సర్కారు తమ పార్టీది కాకపోతే ప్రయోజనం ఉండడం లేదు.

ఎమ్మెల్యే మనోడైనా.. ప్చ్‌..

అధికారంలో లేకుంటే ప్రయోజనం సున్నా

నాడు కాంగ్రెస్‌.. నేడు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఆవేదన

సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ చిత్రం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 16: ఎమ్మెల్యే తమవారైతే చాలు కార్యకర్తల జోరు అంతా.. ఇంతా కాదు. అయితే ఎమ్మెల్యే తమ వాడే అయినా సర్కారు తమ పార్టీది కాకపోతే ప్రయోజనం ఉండడం లేదు. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి చెందిన సంగారెడ్డి, సదాశివపేటలోని పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సలో చేరారు. అప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కోగా.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పరిస్థితి ఇలాగే తయారైంది.

పార్టీ అధికారంలో లేకుంటే అంతే...

ఎమ్మెల్యేగా ఎన్నికైనా అధికార పార్టీకి చెందిన వారైతేనే అటు నియోజకవర్గ అభివృద్ధికి, ఇటు కార్యకర్తల పనులకు ఆటంకాలు ఉండవనేది అందరికి తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడా లేనటువంటి చిత్రమైన పరిస్థితి సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పడింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2018 నుంచి 2023 నవంబరు వరకు కాంగ్రె్‌సకు చెందిన టి.జగ్గారెడ్డి ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధికారులు గౌరవమర్యాదలు ఇచ్చేవారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టులు అప్పగించేవారు. వివిధ పనుల నిమిత్తం మండల తహసీల్దార్‌ తదితర కార్యాలయాలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు అధికారులు మర్యాదలు ఇచ్చి, పనులు చేసిపెట్టేవారు. ఈ విషయంలో తన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా అప్పటి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్‌ వర్గాలు వాపోయాయి. ప్రభుత్వం అధికార కార్యకలాపాలకు, అభివృద్ధి పనుల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలకు కూడా ఆయన హజరయ్యేవారు కాదు. ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ హెచ్‌డీసీ చైర్మన్‌ హోదాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నాయకులు, కార్యకర్తల పనుల కోసం అధికారులకు సిఫారసు చేసేవారు.

ఈసారి సీన్‌ రివర్స్‌

గత నెలలో జరిగిన ఎన్నికలలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ గెలుపొందారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మొన్నటి దాకా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న టి.జగ్గారెడ్డి మాజీ అయ్యారు. అయినా ప్రభుత్వం మనదే వచ్చినందున నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని జగ్గారెడ్డి భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పనులకు తన సతీమణి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నిర్మలాజగ్గారెడ్డిని ఆహ్వానించాలని జగ్గారెడ్డి అధికారులను కోరారు. గత ఐదేళ్లలో తాను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వం లేకపోవడంతో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని గుర్తుచేశారు. ఇప్పుడు తమ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందున తమకు ప్రాధాన్యం కల్పించాలని జగ్గారెడ్డి కోరారు. ఇలా ఉండగా జగ్గారెడ్డి కోరినట్టుగానే మండలాలలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తున్నారు. అదే సమయంలో తమకు ఎమ్మెల్యే ఉన్నా పట్టించుకోవడంలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కంది మండలంలోని ఓ కార్యాలయం అధికారులు తమ ముందే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వడం చూస్తే ఎమ్మెల్యే ఉండి కూడా తము ప్రయోజనం లేకుండాపోతుందని ఆ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఏమైనా ఐదేళ్లలో సీన్‌ పూర్తిగా రివర్స్‌ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయంశమవుతున్నది.

Updated Date - Dec 17 , 2023 | 12:13 AM