నేడు రాకపోతే.. ఇంటికే..
ABN , First Publish Date - 2023-09-21T23:41:34+05:30 IST
విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక దీక్షలు విరమించి శుక్రవారం ఉదయం విధుల్లో చేరాలని,

ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సర్వశిక్షా సిబ్బందికి సంగారెడ్డి డీఈవో హెచ్చరిక
సంగారెడ్డి అర్బన్, సెప్టెంబరు 21 : విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక దీక్షలు విరమించి శుక్రవారం ఉదయం విధుల్లో చేరాలని, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షా ఉద్యోగులు 18 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దీక్షా శిబిరం వద్దకు డీఈవో వెంకటేశ్వర్లు గురువారం విచ్చేసి ఉద్యోగులతో మాట్లాడారు. వారి డిమాండ్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని తెలియజేశారు. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ఉద్యోగులకు మెసేజ్ రూపంలో కూడా సమాచారం చేరవేశారు. ఇదే విషయమై డీఈవోను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు నేడు ఉదయం విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని తెలిపారు.
రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విరమణ
డీఈవో హెచ్చరికలపై సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు స్పందిస్తూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు, సంబంధితశాఖ మంత్రి రాత పూర్వకంగా హామీ ఇస్తేనే దీక్షలు విరమిస్తామని స్పష్టం చేశారు. కనీసం పత్రికా ప్రకటన ద్వారానైనా హామీల అమలుపై వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడేలా ఆదేశాలివ్వడం సమంజసం కాదని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే తమను విద్యాశాఖలో విలీనం చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.