పంచాయతీ భవనాలకు మోక్షమెప్పుడో!

ABN , First Publish Date - 2023-03-25T23:52:50+05:30 IST

మెదక్‌ జిల్లాలో చాలా చోట్ల గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

పంచాయతీ భవనాలకు మోక్షమెప్పుడో!

మెదక్‌ జిల్లాలో 97 భవనాలకు గ్రీన్‌సిగ్నల్‌

ఉపాధిహామీ నిధులు రూ.19.40 కోట్లు

పనులు మంజూరు చేసి మూడు నెలలు

ఇంకా మొదలవని నిర్మాణ పనులు

ముందుకురాని సర్పంచ్‌లు.. జంకుతున్న కాంట్రాక్టర్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మార్చి 25 : పల్లెల్లో మెరుగైన పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు శిథిలావస్థకు చేరిన గ్రామసచివాలయాల స్థానంలో కొత్తవి నిర్మించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మెదక్‌ జిల్లాలో 97 భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఉపాధిహామీ నిధుల నుంచి కేటాయించింది. గతేడాది డిసెంబరు18న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా భవన నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.

మెదక్‌ జిల్లాలో చాలా చోట్ల గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు పెంకుటిళ్లు, పాఠశాల తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీహాళ్లు.. ఇలా ఎక్కడ ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉంటే అక్కడే కొనసాగుతున్నాయి. చాలాచోట్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులను మంజూరు చేసింది. మెదక్‌ జిల్లాలోని 11 మండలాల పరిధిలో 97 పంచాయతీ భవనాలకు రూ.19.40 కోట్లు మంజూరు చేసింది.

మొదలుకాని పనులు

గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి నిధులను కేటాయించారు. పనులను నామినేషన్‌ ద్వారా అప్పగించాలని నిర్ణయించారు. కానీ భవన నిర్మాణ పనులను చేపట్టడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు తయారైంది. గ్రామాల్లో సర్పంచుల ద్వారా పనులను చేయించాలని అనుకున్నా పంచాయతీల నిర్వహణకే నిధులు సమకూర్చడానికి తిప్పలు పడుతున్న సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. మెజార్టీ పంచాయతీలకు సొంత ఆదాయం లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఉన్నది. ఇప్పటికే సొంత నిధులు వెచ్చించి చేసిన పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, డంప్‌యార్డులు తదితర పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 20 లక్షలు వెచ్చించి పనులు చేయడానికి ఏ సర్పంచ్‌ సిద్ధంగాలేరు. నామినేషన్‌ పద్ధతిలో పనులు నిర్వహించాలని నిర్ణయించడంతో టెండర్లు పిలిచే అవకాశం కూడా లేకుండాపోయింది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తెలిసిన కాంట్రాక్టర్లతో పనులు చేయిద్దామన్నా బిల్లులు సమయానికి వస్తాయనే నమ్మకం లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో పంచాయతీలకు నూతన భవనాలు కలగానే మిగిలిపోతున్నాయి.

ప్రభుత్వమే నిర్మించాలి : అరుణ్‌కుమార్‌, సర్పంచ్‌, జెడ్చెరువు తండా, నిజాంపేట మండలం

మా తండాను ప్రభుత్వం పంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామ కార్యాలయం కోసం తాత్కాలికంగా పాత భవనం కేటాయించారు. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. ఇటీవల ప్రభుత్వం నూతన భవన నిర్మానానికి నిధులు మంజూరు చేసింది. కానీ రూ.20 లక్షలతో నిర్మాణం చేయాలంటే మాలాంటి సర్పంచ్‌లకు సాధ్యం కాదు. ప్రభుత్వమే చొరవ తీసుకుని భవనాలను నిర్మించాలి.

వచ్చే నెలలో ప్రారంభిస్తాం :

సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ, మెదక్‌

ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స కింద మెదక్‌ జిల్లాకు 97 గ్రామపంచాయతీ భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ పనులను వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాం. ప్రస్తుతం గ్రామాల్లో సీసీరోడ్ల పనులు నడుస్తున్నాయి. మార్చి నెలాఖరుకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులను పూర్తిచేస్తాం. అనంతరం పంచాయతీ భవన నిర్మాణంపై దృష్టిసారిస్తాం. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి సర్పంచ్‌లు ముందుకొస్తే తక్షణమే అన్ని అనుమతులు ఇస్తాం.

Updated Date - 2023-03-25T23:52:50+05:30 IST