నిధులు లేక.. నిర్వహణ భారం

ABN , First Publish Date - 2023-09-21T23:43:43+05:30 IST

రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన రైతువేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది.

నిధులు లేక.. నిర్వహణ భారం

రైతువేదికలకు రూ.12.50 కోట్లు బకాయి

సంగారెడ్డి జిల్లాలో ఏడాదిగా మంజూరు కాని నిధులు

సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 21 : రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన రైతువేదికల నిర్వహణ అధికారులకు భారంగా మారింది. అన్నదాతలకు సాగులో మెళకువలు, ఆధనిక వ్యవసాయ పద్ధతులు వివరించడంతో పాటు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై చైతన్యం కలిగించడానికి వీటిని నిర్మించారు. సంగారెడ్డి జిల్లాలో క్లస్టర్లవారీగా 116 రైతు వేదికలను 2021లో నిర్మించారు. జాతీయ ఉపాధిహమీ పథకం కింద ఒక్కోదానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వెచ్చించారు. రైతువేదికల నిర్మాణంలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. సకల సౌకర్యాలు కల్పించి నిర్వహణ బాధ్యతలను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు.

ఒక్కో రైతువేదికకు రూ.9వేలు

నిర్వహణ కోసం ప్రతీ నెల ఒక్కో రైతువేదికకు రూ.9వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. విద్యుత్‌చార్జిల కోసం రూ.వెయ్యి, పారిశుధ్య నిర్వహణకు రూ.5,500, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, స్టేషనరీ, రైతులకు శిక్షణ కోసం రూ.వెయ్యి, తాగునీటికి రూ.500 ఖర్చు చేయాలని నిర్ణయించారు. కానీ లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతువేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏడాది నుంచి నిధులివ్వడంలేదు. సంగారెడ్డి జిల్లాలోని 116 రైతువేదికలకు ఏడాది నుంచి రూ.12.50 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. పలుచోట్ల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు వీటి ఖర్చులను భరిస్తున్నారు. నిధుల కొరత కారణంగా అవగాహన కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. భూసార పరీక్షల కోసం అందజేసిన కిట్లు నిరుపయోగంగా మారాయి.

Updated Date - 2023-09-21T23:43:43+05:30 IST