Share News

రూ. 3 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగం..

ABN , First Publish Date - 2023-12-11T00:06:18+05:30 IST

రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో గోడలు బీటలువారి, ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది.

రూ. 3 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగం..

మూడేళ్ల క్రితం నిర్మాణం పూర్తి

ప్రారంభానికి నోచుకోని వైనం

పగుళ్లుబారిన గోడలు, చిట్టడవిలా మారిన భవన ప్రాంగణం

శివ్వంపేట, డిసెంబరు 10: రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో గోడలు బీటలువారి, ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు 100 మందికి వసతి కల్పించేందుకు నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. 2016 జూలైలో తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ. 3 కోట్లతో నూతన వసతిగృహ భవనం నిర్మించాలని నిర్ణయించారు. అప్పటి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్‌ నత్తనడకన పనులను చేపట్టడంతో 2021లో పనులు పూర్తిచేశారు. మూడేళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరితో భవనం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో భవనం ప్రారంభించకముందే గోడలు బీటలువారి పిచ్చి మొక్కలతో కళావిహీనంగా తయారైంది. అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని హాస్టల్‌ భవనం అందుబాటులోకి తీసుకువస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

భవనాన్ని బీసీ సంక్షేమశాఖకు అప్పగిస్తాం

-సుహాసిని, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

వసతిగృహంలో ఉండే విద్యార్థులు ప్రతీనెల రూ.1,700 చెల్లించాల్సి ఉండడంతో డబ్బులు కట్టేందుకు వారు ముందుకురావడం లేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. త్వరలో భవనాన్ని బీసీ వెల్ఫేర్‌శాఖకు అప్పగిస్తాం. ఇలా చేస్తే విద్యార్థులు డబ్బులు లేకుండానే ఉచితంగా వసతి అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-12-11T00:06:19+05:30 IST