Share News

రింగ్‌..పెండింగ్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:43 PM

మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో మునిసిపాలిటీ చుట్టూ రింగ్‌రోడ్డును నిర్మించేందుకు 2015లో శంకుస్థాపన చేశారు.

రింగ్‌..పెండింగ్‌
గజ్వేల్‌లోని రైల్వేస్టేషన్‌ వద్ద నిలిచిన రింగ్‌రోడ్డు పనులు

కోర్టు కేసులతో ఆగిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు

రైల్వేస్టేషన్‌ వద్ద కిలోమీటరున్నర, పాత ఆర్డీవో కార్యాలయం వద్ద వంద మీటర్ల మేర నిలిచిన పనులు

కోర్టు కేసుల్లో సదరు భూములు

గజ్వేల్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రజలకు ఇక్కట్లు

రింగ్‌రోడ్డు పెండింగ్‌ సాకుతో నిలిచిన కూడళ్ల సుందరీకరణ

గజ్వేల్‌, డిసెంబరు 18: మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో మునిసిపాలిటీ చుట్టూ రింగ్‌రోడ్డును నిర్మించేందుకు 2015లో శంకుస్థాపన చేశారు. రూ.220 కోట్ల ప్రాథమిక అంచనాతో 22.5 కిలోమీటర్ల మేర ప్రారంభమైన రింగ్‌రోడ్డు పనులు మూడేళ్ల పాటు నెమ్మదిగా సాగాయి. 2018లో అప్పటి కాంట్రాక్టర్‌ పాత రేట్లు, కొత్త రేట్లకు తేడా ఉందని, 2015 రేట్లతో తనకు గిట్టుబాటు కాదం టూ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.338 కోట్లకు రింగ్‌రోడ్డు నిర్మాణం అంచనాను పెంచింది. దీంతో 2021లో చేపట్టిన రాజీవ్‌ రహదారి బైపాస్‌ మినహా మిగతా ఎక్కడా కనెక్టివిటీ జరగలేదు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు తూర్పు భాగంలో రాజీవ్‌ రహదారికి బైపా్‌సగా ప్రత్యేకంగా 6.4 కిలోమీటర్ల మేర ఆరులైన్ల నిర్మాణం చేపట్టారు. రాజీవ్‌ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు నేరుగా మూడు ఫ్లైఓవర్ల మీదుగా వె ళ్తున్నాయి. తొమ్మిది జంక్షన్లు, మూడు ఫ్లైఓవర్లతో మెట్రో నగరాలలో చేపట్టిన రహదారులకు ధీటుగా రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు ఈ రింగ్‌రోడ్డు పరిధిలో జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సర్కిళ్లను అద్భుతంగా సుందరీకరణ చేపట్టాలని సంకల్పించారు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా దాదాపుగా 1.6 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు నిర్మాణం కోర్టు కేసుల నేపథ్యంలో పెండింగ్‌లో పడింది. గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద దాదాపు కిలోమీటర్‌కు పైగా రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉండగా, పాత ఆర్డీవో కార్యాలయం వద్ద దాదాపుగా 100 మీటర్ల రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

రింగ్‌ రోడ్డు నిర్మాణంతో తగ్గనున్న ప్రమాదాలు

కరీంనగర్‌, సిద్దిపేట, మంచిర్యాల, వేములవాడ, రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే వాహనాలు ప్రజ్ఞాపూర్‌ ప్రారంభంలో ఫ్లైఓవర్‌ ఎక్కితే నేరుగా రిమ్మనగూడ వద్ద మళ్లీ రాజీవ్‌ రహదారిలో కలవనున్నాయి. ప్రజ్ఞాపూర్‌తో సంబంధం లేకుండా రింగ్‌రోడ్డు నుంచి వాహనాలు వెళ్లిపోనున్నాయి. ప్రజ్ఞాపూర్‌లో మూడు రోడ్ల కూడళ్లు అయిన సిద్దిపేట-గజ్వేల్‌-హైదరాబాద్‌,జగదేవ్‌పూర్‌-సిద్దిపేట-హైదరాబాద్‌ కూడళ్లలో ప్రమాదాలు సర్వసాధార ణంగా జరిగేవి. ప్రతి నెలలో రెండు, మూడు ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆయా కూడళ్లలో వాహనాల రాకపోకల సంఖ్య తగ్గి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. గజ్వేల్‌ నుంచి వెళ్లే వాహానాలు రింగ్‌రోడ్డు పూర్తికాకపోవడంతో టౌన్‌ నుంచి వెళ్లాల్సి వస్తుంది. రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడితే సంగారెడ్డి, తూప్రాన్‌ నుంచి జగదేవ్‌పూర్‌, భువనగిరి, చిట్యాల వెళ్లే వాహనాలు నేరుగా రింగ్‌రోడ్డు నుంచి వెళ్తాయి. పట్టణంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ తగే ్గ అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారికి అనుసంధానంగా నిర్మించిన బైపాస్‌ తప్ప తూప్రాన్‌ నుంచి చేగుంట నుంచి వచ్చే రోడ్ల ఇంకా రింగ్‌రోడ్డు కనెక్టివిటీ జరగలేదు. ఈ రోడ్ల వెంటనే అత్యధిక భారీ వాహనాలు రావడం, రింగ్‌రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పట్టణం నుంచి భారీ వాహనాలు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

పట్టణంలో పూర్తి కాని రేడియల్‌ రోడ్లు

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన రేడియల్‌ రోడ్లు పూర్తి కాలేదు. పిడిచెడ్‌ రోడ్డులో ఓ ఇళ్లు ఉండగా, ఈ రోడ్డు సగం సగం పూర్తవగా, ముట్రాజ్‌పల్లి రోడ్డు విస్తరణను చేపట్టలేదు. ఇక సంగాపూర్‌ రోడ్డులో కమాన్‌తో పాటు చుట్టూ ఇళ్లు, వాణిజ్య మడిగలు ఉండడం, కోటమైసమ్మ రోడ్డులో నిర్మాణాలు ఉండడంతో పట్టణంలో ఏ ఒక్క రేడియల్‌ రోడ్డు పూర్తి కాలేదు. దీంతో కూడళ్ల సుందరీకరణ పనులు ఎక్కడివక్కడే పెండింగ్‌లో పడ్డాయి. పదేళ్ల కాలంలో ఒక్క రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో అనేక విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా ఇందిరాపార్కు చౌరస్తాను అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు చౌరస్తాలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రింగురోడ్డుతో పాటు రేడియల్‌ రోడ్లను పూర్తి చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా స్పందించి రింగ్‌రోడ్డును పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:43 PM