కోనోకార్పస్‌ చెట్లను తొలగించండి..!

ABN , First Publish Date - 2023-03-25T23:08:46+05:30 IST

చేర్యాల, మార్చి 25: పక్షులు వాలకపోగా, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసే కోనోకార్పస్‌ చెట్లు, మొక్కలను తొలగించాలని చేర్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కోనోకార్పస్‌ చెట్లను తొలగించండి..!
చేర్యాల కుడిచెరువు ఆవరణలో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీ

చేర్యాల పట్టణ ప్రజల వేడుకోలు

చేర్యాల, మార్చి 25: పక్షులు వాలకపోగా, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసే కోనోకార్పస్‌ చెట్లు, మొక్కలను తొలగించాలని చేర్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు. హరితహారం పేరిట జనగామ-సిద్దిపేట జాతీయ ప్రధాన రహదారికి ఇరుపక్కల, డివైడర్లలో కొన్నాళ్ల క్రితం కోనోకార్పస్‌ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి పచ్చదనం రూపుదిద్దుకున్నప్పటికీ ప్రాణాంతకరమైనవిగా ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పట్టణాన్ని హరితమయంగా తీర్చిదిద్దేందుకు రెండు ప్రదేశాలలో నర్సరీలను ఏర్పాటుచేశారు. వీటిలో పలురకాల పూల మొక్కలు ఉన్నా అధిక డబ్బులు వెచ్చించి పొరుగు ప్రాంతాల నుంచి కోనోకార్పస్‌ మొక్కలు తెప్పించి నాటారు. దీంతో పట్టణం కాస్త పచ్చదనం సంతరించుకున్నా ఆయా నర్సరీలలో పూలు, నీడనిచ్చే మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆయా నర్సరీలను ఎవరూ పట్టించుకోకపోవడంతో మొక్కలు మూలుగుతున్నాయి. మరికొన్నింటిని విత్తనాలు వేయడానికి కవర్లలో మట్టిని నింపి సంసిద్ధం చేసినప్పటికీ సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మారాయి. గతంలో మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చిన మొక్కలను నాటకుండా వదిలేసి గురుకుల పాఠశాల ఆవరణలో నిల్వ చేయగా వందలాది మొక్కలు ఎండిపోయాయి. మరికొన్ని ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల చేర్యాల సమీపంలోని ఆలేరు మున్సిపల్‌ అధికారులు కోనోకార్పస్‌ మొక్కలు తొలగించిన క్రమంలో చేర్యాల మున్సిపల్‌ అధికారులు, పాలకమండలి స్పందించి ఇక్కడ కూడా కోనోకార్పస్‌ తొలగించి వాటిస్థానంలో పూలు, నీడనిచ్చే మొక్కలు నాటాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ అధికారులు, పాలకమండలి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-03-25T23:08:46+05:30 IST