సామాజిక స్పృహ పెంపునకే ‘తెరవే’ పునర్నిర్మాణం
ABN , First Publish Date - 2023-07-14T00:33:56+05:30 IST
తెలంగాణ రచయితల వేదిక (తెరవే)ను పునర్నిర్మించడమే కాకుండా తమ రచనలతో ప్రజల్లో సామాజిక స్పృహను రగిలింపజేస్తామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి తెలిపారు.
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి
రామాయంపేట, జూలై 13: తెలంగాణ రచయితల వేదిక (తెరవే)ను పునర్నిర్మించడమే కాకుండా తమ రచనలతో ప్రజల్లో సామాజిక స్పృహను రగిలింపజేస్తామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా తెరవే సర్వసభ్య సమావేశాన్ని గురువారం సాయంత్రం రామాయంపేటలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ తమ రచనల ద్వారా జనంలో చైతన్యం తీసుకురావడమే తెరవే లక్ష్యంగా చెప్పారు. తమ సంస్థ ఎవరికీ పోటీ కాదని, ఎవరికీ అడ్డు కూడా కాదని ఆయన వివరించారు. ప్రజల పక్షాన నిలుస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగడమే తమ కర్తవ్యమని అన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, కళల ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే దిశగా కృషి చేస్తామని మల్లారెడ్డి వివరించారు. తెరవేను అన్ని జిల్లాలకూ విస్తరిస్తామని, ప్రతి జిల్లాలో కమిటీలను నియమిస్తామని ఈ సందర్భంగా మల్లారెడ్డి వివరించారు. కమిటీల ఏర్పాటు అనంతరం రాష్ట్ర స్థాయిలో పునర్‌వైభవ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెరవే మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరకపల్లి యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి ఉప్పల పద్మ, తెరవే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా రమేష్ బాబు నియామకం
తెలంగాణ రచయితల వేదిక జిల్లా కార్యవర్గాన్ని ఈ సందర్భంగా నియమించారు. అధ్యక్షుడిగా దేశరాజు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, ఉపాధ్యక్షులుగా భిక్షపతి, కిషన్, కార్యదర్శులుగా మల్లేశం, శివమల్లు, కార్యవర్గ సభ్యులుగా శ్రీరామ్, రాగి నర్సింహులు నియమితులయ్యారు.