లక్ష్యం మేరకు చింతమడక పునర్నిర్మాణం పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-07-16T00:19:15+05:30 IST
జిల్లా మహిళా సమాఖ్య, వృద్ధ ఆశ్రమ భవనాల పనులు వేగవంతం చేయాలి సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట అగ్రికల్చర్, జూలై 15: అనుకున్న లక్ష్యం మేరకు చింతమడక పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టరును రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక పునర్నిర్మాణంలో భాగంగా అంకంపేట, మాచాపుర్, సీతారాంపల్లి, శంకర్‌నగర్ గ్రామాల్లో ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి, సుడా రవీందర్ రెడ్డి, ఆర్డీవో, చింతమడక స్పెషల్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. చింతమడక గ్రామ పునర్నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్, అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గ్రామ రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవనం ఆగస్టు 15లోగా ప్రారంభానికి సిద్ధం చేయకపోతే సంబంధిత ఇంజనీర్ అధికారిపై వేటు వేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లా మహిళా సమాఖ్య భవనం, వృద్ధ ఆశ్రమ భవనాలు సెప్టెంబరు 15లోపు, మహిళా ప్రాంగణం ఆగస్టు మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీర్ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలోని కేజీబీవీ పాఠశాల మిట్టపల్లి, కొమురవెళ్లి, తొగుటలో శాశ్వత భవనాలు సెప్టెంబర్ 15లోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అదనపు తరగతి గదులు నిర్మించి సిద్ధంగా ఉన్న కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడ్ అధికారుల మధ్య సమన్వయం లేదని, అందుకే జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు ముందుకు సాగడం లేదని మంత్రి హరీశ్‌రావ్ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడ్ అధికారులు సమన్వయంతో, జాయింట్ విజిట్ చేస్తే సత్ఫలితాలు వస్తాయని ఆయా శాఖాధికారులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సుతిమెత్తగా మందలించారు. వర్మీ కంపోస్టు సిద్దిపేట మున్సిపాలిటీలో చాలా ఉన్నదని, సిద్దిపేట మున్సిపాలిటీ వర్మీ కంపోస్టు తన ఫామ్‌హౌసులో వాడుతున్నానని చాలా బాగుందని మంత్రి చెప్పారు. అవసరమైన రైతులకు అందించి, వారిని చైతన్యం చేయాలని వ్యవసాయ అనుబంధ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల వరి నార్లు సిద్ధం చేశారని, 17వేల వరి నాట్లు పడ్డాయని సమీక్షలో వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ మంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.