రేషన్‌బియ్యం అక్రమ రవాణా!
ABN , First Publish Date - 2023-04-16T23:01:16+05:30 IST
గ్రామాల్లో వాహనాలపై తిరుగుతూ కొనుగోళ్లు జహీరాబాద్‌లోని ఏజెంట్లకు రహస్యంగా అమ్మకం అక్కడి నుంచి పక్క రాష్ట్రాల్లోని మార్కెట్‌కు తరలింపు అధికారుల కనుసన్నల్లోనే సాఫీగా దందా!
జహీరాబాద్, ఏప్రిల్ 16: జహీరాబాద్ నియోజకవర్గంలో రేషన్‌బియ్యం అక్రమరవాణా జోరుగా సాగుతున్నది. రేషన్ దుకాణాల్లో బియ్యాన్ని ప్రతీనెల 1నుంచి 15 వరకు వినియోగదారులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రేషన్‌బియ్యం దొడ్డువిగా ఉండడం, అందులో నూకలు, ఇసుక ఉండడంతో 70శాతం మంది వినియోగదారులు బియ్యాన్ని తినడానికి ఇష్టపడడం లేదు. 30 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. దీంతో వాటిని సమీపంలోని కిరాణ దుకాణాల్లో, గ్రామాల్లో తిరిగి బియ్యం కొనే వారికి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో వినియోగదారుల వద్ద కొన్న బియ్యాన్ని జహీరాబాద్ పట్టణంలోని గల్లీల్లో రహస్యంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఏజెంట్లకు అమ్ముతుంటారు. ఏజెంట్లు ప్రతినెలా 10నుంచి 25వరకు సేకరించిన బియ్యాన్ని పక్క రాష్ర్టాలకు అక్రమంగా తరలిస్తుంటారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమ్మకం
వినియోగదారులు చౌకధరల దుకాణాల్లో రూపాయికి కిలోబియ్యాన్ని తీసుకుని వాటిని కిలో రూ.12-15 వరకు గ్రామాల్లో వాహనాలపై తిరిగి కొనుగోలు చేసే వారికి విక్రయిస్తారు. కొనుగోలుదారులు వాటిని మిల్లులకు తరలించి సన్నబియ్యంగా మార్చి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. మరికొందరు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రాత్రివేళ్లల్లో పెద్ద పెద్ద వాహనాల్లో తరలించి అక్కడ బహిరంగ మార్కెట్‌లో కిలోబియ్యాన్ని రూ.20-30వరకు అమ్ముతుంటారు.
చెక్‌పోస్టుల ఎత్తివేతతో జోరుగా రవాణా
ప్రతీనెల జహీరాబాద్ ప్రాంతం మీదుగా వేలాది క్వింటాళ్ల రేషన్‌బియ్యం పక్క రాష్ర్టాలకు అధికారుల కనుసన్నల్లోనే తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలో గల బియ్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేయకపోవడంతో రేషన్‌బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీని ఏర్పాటు చేయడంతో ఒకసారి కట్టిన వేబిల్లునే తరచూ చూపుతూ అక్రమ రవాణాదారులు రేషన్‌బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. వాణిజ్యపన్నుల చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో రేషన్ బియ్యం అక్రమరవాణా కల్పతరువుగా మారింది. గతంలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులు ఉండడంతో అక్రమ రవాణా అంతగా జరిగేది కాదు. ప్రస్తుతం అక్రమంగా రేషన్‌బియ్యం, సరుకులను రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీలు చేసేందుకు అధికార యంత్రాంగం లేకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది.