ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2023-02-21T00:35:11+05:30 IST
ప్రతీ హిందువూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
భగవంతుడి ఎదుట అందరూ సమానమే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఝరాసంగం, ఫిబ్రవరి 20 : ప్రతీ హిందువూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బర్ధీపూర్ ఆశ్రమంలో దత్తగిరి మహరాజ్ శత జయంతి మహోత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆశ్రమంలోని జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆశ్రమంలోని వైదిక పాఠశాలలో విద్యార్థులను అర్చకులగా తీర్చిదిద్దుతుండడం అభినందనీయమని కొనియాడారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, విద్యార్థులు రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని జ్ఞాన సమూపార్జణ చేయాలని సూచించారు. కొంతమంది ధర్మ విరోధులు స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ సమాజాన్ని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని, అలాంటివారికి సరైన గుణపాఠం చెప్పలని పిలుపునిచ్చారు. భారత దేశం ప్రపంచానికే మార్గం చూపుతున్న జ్ఞాన కిరణమని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు సేవ చేస్తే భగవంతుడికి చేసినంత ఫలితం దక్కుతుందని అన్నారు. అనంతరం ఆశ్రమ పీఠధిపతి వైరాగ్య శిఖమణి అవదూతగిరి మహరాజ్, డాక్టర్ సిద్దయ్యస్వామి ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు బాబూమోహన్, చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, సామాజికవేత్త అప్పల ప్రసాద్, నాయకులు నరేందర్‌రెడ్డి, మల్లికార్జున్, అడివన్న తదితరులు పాల్గొన్నారు.