ఉద్యమాలతోనే ప్రజాస్వామ్య రక్షణ
ABN , First Publish Date - 2023-03-25T00:01:17+05:30 IST
హుస్నాబాద్ పట్టణంలోని బస్‌డిపో గ్రౌండ్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన గ్రామీణ పేదల సంఘం ఆరో రాష్ట్ర మహాసభల బహిరంగ సభలో....
పాలకవర్గాలు ప్రజల జీవన పరిస్థితులను పట్టించుకునే స్థితిలో లేవు
ప్రముఖ ప్రజాతంత్రవాది, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రారెడ్డి
గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర మహాసభలకు తరలివచ్చిన కార్యకర్తలు
హుస్నాబాద్, మార్చి 24: ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖ ప్రజాతంత్రవాది, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని బస్‌డిపో గ్రౌండ్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన గ్రామీణ పేదల సంఘం ఆరో రాష్ట్ర మహాసభల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాలకవర్గాలు ప్రజల జీవన పరిస్థితులను పట్టించుకునే స్థితిలో లేవన్నారు. రాజకీయ పార్టీలకు పదవులు, ఎన్నికలు, అధికార ధ్యాసే తప్పా ప్రజల సమస్యలపై ఆలోచన లేదన్నారు. సమస్యల విముక్తి కోసం జనాన్ని సమీకరించి ఉద్యమాల వైపు నడిపించాలని నిర్దేశం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య, బీవీఎన్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామీణ పేదల సంఘం వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. మార్క్సిజమే ప్రపంచాన్ని రక్షిస్తుందన్నారు. పెట్టుబడిదారి, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. పాలకవర్గాలు అవలంభిస్తున్న అభివృద్ది నిరోధక, ఫాసిస్టు నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామీణ పేదలను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహర్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. రాత్రి 9 గంటలకు బహిరంగ సభ ప్రారంభమైంది. దీనికి ముందు హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుంచి బస్‌డిపో గ్రౌండ్ వరకు డప్పుచప్పుళ్లు, నృత్యాల మధ్య ఎర్రజెండాలు చేబూని భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ పేదల సంఘం వర్ధిల్లాలి, దున్నేవాడికే భూమి నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఈ బహిరంగ సభలో నవోదయ కళాకారుల ప్రదర్శనలు, వీదినాటకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐసీఎ్‌ఫఎ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జతిన్‌కుమార్, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి, విజయేందర్‌రావు, టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్, జిల్లా నాయకులు చెన్నబోయిన వెంకటాద్రి, మల్లేశం, శ్రీహరి, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.