Share News

బస్సుల్లేక విద్యార్థుల ఇబ్బందులు

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:12 PM

విద్యార్థుల కోసం మరిన్ని బస్సులు నడపాలి ఏబీవీపీ నాయకుల డిమాండ్‌ సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో ధర్నాలు

బస్సుల్లేక విద్యార్థుల ఇబ్బందులు
ఖేడ్‌లో ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాన్ని అందజేస్తున్న ఏబీవీపీ నాయకులు

సంగారెడ్డి అర్బన్‌/నారాయణఖేడ్‌, డిసెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ అవసరాల కోసం అమలు చేస్తున్న పథకాలతో సామాన్య ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆకాశ్‌ అన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎం ఉపేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆకాశ్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తుంటారని, ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో అధికమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతో నిత్యం కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. లేదంటే విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు వెంకటరెడ్డి, విభాగ్‌ హాస్టల్‌ కన్వీనర్‌ తానాజీ, దినేశ్‌, శశాంక్‌, నిఖిల్‌, వెంకట్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖేడ్‌ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. మనీపాసుల కోసం విద్యార్థులు డబ్బులు చెల్లిస్తున్నా అవస్థలు తప్పడం లేదని ఏబీవీపీ ఖేడ్‌ నగర కార్యదర్శి అనిల్‌కుమార్‌ అన్నారు. ధర్నా అనంతరం ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పండు, శివ, శంకర్‌, కార్తీక్‌, విజయ్‌, పవన్‌, రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:12 PM