నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ABN , First Publish Date - 2023-03-05T23:41:04+05:30 IST
శ్రీరాంసాగర్ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ అన్నారు.
గౌరవెల్లి నిర్వాసితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం
రిజర్వాయర్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్
హుస్నాబాద్, మార్చి 5 : శ్రీరాంసాగర్ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయమైన, ఎక్కడా లేని విధంగా పరిహారం అందించామని చెప్పారు. వివాహం అయిన యువతులు పరిహారం అడుగుతున్నారని, అది సాధ్యం కాదన్నారు. మీకు డబ్బులు వస్తే సరిపోతుందా?లక్షల ఎకరాలకు సాగునీరు అవసరం లేదా? అని నిర్వాసితులను ప్రశ్నించారు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందుకే రిజర్వాయర్‌కు ఉపయోగపడే ఇసుక రాకుండా బీజేపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారన్నారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు. గండిపల్లి ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం కాలువలు మాత్రమే తవ్వారన్నారు. ఇటీవల ఒకాయన ఇక్కడికి వచ్చి నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉందని, వాటన్నింటినీ ఒకటి చేస్తామని మాట్లాడరని అంటూ పరోక్షంగా టీపీసీసీ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ప్రజల ఆకాంక్ష మేరకే మూడు జిల్లాల్లో కలిపామని, వ్యతిరేకత ఉంటే గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎందుకు గెలుస్తామని ప్రశ్నించారు. సంత్ సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. సంగారెడ్డిలో ఉన్న డీటీడబ్ల్యూవో ఆఫీసును హుస్నాబాద్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ఎస్‌టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్, హన్మకొండ జడ్పీచైర్మన్ సుదీర్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, ఎంపీపీలు మానస, కీర్తి, నవ్య, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజనీ, మాజీ చైర్మన్లు అశోక్‌బాబు, తిరుపతిరెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, గిరిజన సంఘాల నాయకులు కిషన్‌నాయక్, భీమాసాహేబ్, జి తిరుపతినాయక్, ఎల్ తిరుపతినాయక్, శ్రీనివా్‌సనాయక్, రమే్‌షనాయక్, రూప్‌సింగ్, మోతిలాల్, శివరాజ్, సత్యంనాయక్, రాజమల్లు,సంపత్, కిషన్‌నాయక్ తదితరులున్నారు.
20న మంత్రి కేటీఆర్ పర్యటన
ఈనెల 20న హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండోర్ స్టేడియం, టీటీసీ భవన్, బస్తీ ధవాఖానా ప్రారంభోత్సవం, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, రూ.3.50కోట్లతో చేపట్టే ఎల్లమ్మ చెరువు పనుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పీఆర్ రోడ్ల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు వంగ వెంకట్రామ్‌రెడ్డి, ఎండి అన్వర్, కాసర్ల అశోక్‌బాబు, కొత్త శ్రీనివా్‌సరెడ్డి తదితరులున్నారు.