పరిహారం కోసం పెట్రోల్ పోసుకుని..
ABN , First Publish Date - 2023-05-09T00:37:46+05:30 IST
సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు హల్‌చల్ చేశాడు. పోలీసులు, స్థానికులు అతన్ని అడ్డుకున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ నిర్మాణంలో భూములు కోల్పోయామని ఆవేదన
అడ్డుకున్న పోలీసులు, స్థానికులు
కలెక్టరేట్‌లో ధర్నా చేపట్టిన భూబాధితులు
సిద్దిపేట అగ్రికల్చర్, మే 8: సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు హల్‌చల్ చేశాడు. పోలీసులు, స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకున్నది. భూబాధితులు మాట్లాడుతూ గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామారెడ్డి కలెక్టర్ కార్యాలయ నిర్మాణం కోసం దుద్దెడ గ్రామంలోని సర్వే నంబరు 663లో, అలాగే రాంపల్లి శివారులోని సర్వే నెంబరు 143లో 165 మంది నుంచి 345 ఎకరాలు భూమిని సేకరించారని తెలిపారు. భూమి తీసుకునే సమయంలో తమకు ప్లాట్‌తో పాటు బోరు బావులు, చెట్లకు రూ.1.25 లక్షలు, ఎకరానికి రూ.8లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీఇచ్చి భూమిని లాక్కున్నారని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా ఎన్నోసార్లు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా న్యాయం మాత్రం చేయడం లేదని వాపోయారు. రూ.8లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేసే వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బాధితులు దాదాపు 66 మంది కలెక్టరేట్ ఆవరణలో భీష్మించుకూర్చున్నారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ అక్కడకు చేరుకుని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని, అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చెప్పారు. ప్రజావాణిలో భూసంబంధిత, రెండు పడగ గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతర మొత్తం కలిపి 64 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లా అధికారులు విధిగా ప్రజావాణికి హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, అధికారులు పాల్గొన్నారు.
సూరంపల్లి సర్పంచ్‌పై ఫిర్యాదు
రాయపోల్ : దౌల్తాబాద్ మండలం సూరంపల్లి సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు పి.శంకర్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ స్వామి తదితరులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించిన వారిని సర్పంచ్ కులంపేరుతో తిడుతూ బెదిరించాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.