మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2023-03-19T00:00:08+05:30 IST

భర్తను వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్న మహిళ హత్య కేసును సంగారెడ్డి పట్టణ పోలీసులు ఛేదించారు.

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రమణకుమార్‌

సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌ వెల్లడి

సంగారెడ్డి క్రైం, మార్చి 18: భర్తను వదిలేసి మరొకరితో సహజీవనం చేస్తున్న మహిళ హత్య కేసును సంగారెడ్డి పట్టణ పోలీసులు ఛేదించారు. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఈ మేరకు.. సంగారెడ్డిలోని మహబూబ్‌సాగర్‌ చెరువులో గోనె సంచిలో కట్టి పడవేసిన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పట్టణ పోలీసులు గురువారం కనుగొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా నాగారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో అదే గ్రామానికి చెందిన కవిత(28)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కవిత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి భర్తను విడిచి వేరుగా వుంటున్నది. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వచ్చి ఒంటరిగా ఉంటున్నది. కాగా కోహీర్‌ మండలం పొడ్డిమల్‌ గ్రామానికి చెందిన మంగలి కృష్ణయ్య ప్రస్తుతం సంగారెడ్డిలోని రాంనగర్‌లో నివాసముంటున్నాడు. అతడికి దాదాపు నెల క్రితం కవితతో బస్టాండ్‌ వద్ద పరిచయం ఏర్పడింది. నాటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కృష్ణయ్య పనికి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఆమె కూడా పనికి వెళ్తున్నానని చెప్పి ప్రతిరోజూ రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య ఇంటికి వచ్చేది. ఇదే విషయమై ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మఽధ్య గొడవ జరిగింది. తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతానని కవిత తేల్చి చెప్పడంతో ఆగ్రహానికి గురైన కృష్ణయ్య ఆమె తలపై గట్టిగా కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. 13వ తేదీన ఉదయం కవిత మృతదేహాన్ని ఒక గోనె సంచిలో తీసుకెళ్లి మహబూబ్‌సాగర్‌ చెరువు ఒడ్డున పడేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పట్టణ పోలీసులు శనివారం కృష్ణయ్యను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును 24 గంటల్లో ఛేదించిన డీఎస్పీ రవీంద్రారెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి, పోలీసులను ఎస్పీ రమణకుమార్‌ అభినందించారు.

Updated Date - 2023-03-19T00:00:08+05:30 IST