ఆడుతూ పాడుతూ.. లెక్కలు

ABN , First Publish Date - 2023-02-21T00:10:34+05:30 IST

ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు కూడా కొందరి పిల్లల్లో గణితం అంటే భయం. అదొక ఫోబియా. గణితంలో ముందు నుంచి భయపడుతూ ఉండేవారు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారు. ఇలాంటి విషయాలను గమనించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పిల్లలకు గణితం అంటే భయాన్ని పోగొట్టే విధంగా ఆటపాటలతో పాటు జాయ్‌ఫుల్‌ లర్నింగ్‌తో అత్యధిక మార్కులు పొందేవిధంగా కృషి చేస్తున్నారు.

ఆడుతూ పాడుతూ.. లెక్కలు
ఆటలతో గణితం నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలు రూపారాణి

పిల్లలకు భయం లేకుండా గణితంపై అవగాహన

ఓ ఉపాధ్యాయురాలి వినూత్న బోధన

కొండపాక, ఫిబ్రవరి 20: ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు కూడా కొందరి పిల్లల్లో గణితం అంటే భయం. అదొక ఫోబియా. గణితంలో ముందు నుంచి భయపడుతూ ఉండేవారు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారు. ఇలాంటి విషయాలను గమనించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పిల్లలకు గణితం అంటే భయాన్ని పోగొట్టే విధంగా ఆటపాటలతో పాటు జాయ్‌ఫుల్‌ లర్నింగ్‌తో అత్యధిక మార్కులు పొందేవిధంగా కృషి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సినగండ్ల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రూపారాణి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రాఫ్‌ గేమ్స్‌, పాయింట్స్‌, చార్‌పత్తా, టక్కర్‌ మార్‌, ప్లాట్‌ ఏ పాయింట్‌, గ్రూప్‌ యాక్టివిటీస్‌ ఆన్‌ గ్రాఫ్‌, డయల్‌ యువర్‌ ఫార్ములా, మ్యాజిక్‌ ఫార్ములాస్‌, డెసిమల్‌ నెంబర్‌ మీటర్‌, ప్రాఫర్టీస్‌ ఆఫ్‌ సర్కిల్‌, నంబర్‌ లైన్‌ గేమ్స్‌ వంటి నమూనాలు తయారు చేసి విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి ఆటల ద్వారా ఇష్టంగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

బతుకమ్మ పాటలతో ఎక్కాలు

విద్యార్థులు ఆడుకునే చార్‌పత్తర్‌ ఆటతో గ్రాఫింగ్‌ పాయింట్లు ఎలా పెట్టొచ్చొ చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్‌ పాయింటింగ్‌ నేర్పిస్తున్నారు. మ్యాజిక్‌ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయొచ్చొ చేసి చూపిస్తున్నారు. సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్‌ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్‌ సర్కిల్స్‌ ఇలా విద్యార్థులకు ఆటలతో అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. అలాగే బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్‌ డిజిటల్‌ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. అంకెలు వంటి గేమ్స్‌ తయారుచేసి గణిత చతుర్విద ప్రిక్రియలను సులువుగా నేర్పించి ఉత్తమ ఫలితాలను సాధించారు. దీంతో విద్యార్థులు గణితం అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. అలాగే అనేక చాఫ్టర్స్‌ను యానిమేటెడ్‌ డిజిటల్‌ రూపంలోకి మార్చి అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసి ఊహాత్మక భావనలను దృశ్యరూపంలోకి మార్చి సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా యూట్యూబ్‌ ఛానల్స్‌, వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు అందించి విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. పదేళ్లుగా పాఠశాల స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలు మూతపడిన కొవిడ్‌ సమయంలో కూడా ఆన్‌లైన్‌ మ్యాథమెటిక్స్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు

గణిత ఉపాధ్యాయురాలు పెందోట రూపారాణి కేరళలోని త్రిశూర్‌లో జరిగిన 34వ దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్‌ టెక్నాలజికల్‌ మ్యూజియం పురస్కారాన్ని అందుకున్నారు. ‘జాయ్‌ ఫుల్‌ లెర్నింగ్‌ బై మ్యాథ్స్‌ గేమ్స్‌-యూజింగ్‌ ఇన్నోవేటివ్‌ ఐడియాస్‌’ అనే నమూనాతో రూపొందించిన ఎగ్జిబిట్లకు టీచర్‌ కేటగిరిలో ఈ అవార్డు అందుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో టీచర్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతరం నిర్మల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో తన ప్రతిభను చాటి వినూత్న ఆలోచనలతో రూపొందించిన ఎగ్జిబిట్లతో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీ నిర్వహించే స్టేట్‌ లెవెల్‌ మ్యాథమెటిక్స్‌ సెమినార్‌కు వరుసగా రెండుసార్లు ఎంపికయ్యారు. కాగా విజయవంతంగా ఇచ్చిన సెమినార్‌ ప్రజెంటేషన్లు ఎస్‌సీఈఆర్‌టీ మ్యాగ్జిన్‌లో వచ్చాయి. మ్యాథమెటిక్స్‌ సింబల్స్‌ను విద్యార్థులు సులభంగా గుర్తుంచుకునేందుకు గాను ఆ సింబల్స్‌తో గణిత శాస్త్రవేత్త రామానుజన్‌ బొమ్మను ముగ్గు పిండితో వేసి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బహుమతి అందుకున్నారు. అంతేకాకుండా ఇటీవలే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు.

ఉత్తీర్ణత శాతం పెరిగింది

పాఠశాలల్లో తాను అనుసరిస్తున్న ఈ విధానం వల్ల పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది. గణితం అంటే పిల్లల్లో భయం పోయింది. మానాన్న రిటైర్డ్‌ టీచర్‌. టూర్‌లకు వెళ్లిన సమయంలో బొమ్మలను తీసుకొచ్చి వాటి ద్వారా విద్యాబోధన చేశారు. దీంతో విద్యార్థులు చదువుపై మక్కువ చూపించేవారు. మా నాన్న స్ఫూర్తితోనే విద్యార్థులకు ఆటపాటల ద్వారా గణితం చెబుతున్నాను.

- రూపారాణి, గణిత ఉపాధ్యాయురాలు

Updated Date - 2023-02-21T00:10:36+05:30 IST