Share News

ముక్కిపోయి.. పురుగుపట్టి..

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:44 PM

ప్రజా పంపీణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం పురుగులు పట్టాయి. బియ్యం నిల్వలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ముక్కిపోయి.. పురుగుపట్టి..

నిల్వ చేయడంలో నిర్లక్ష్యం

పాడైపోయిన రూ. 10 కోట్ల బియ్యం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు 18 : ప్రజా పంపీణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం పురుగులు పట్టాయి. బియ్యం నిల్వలను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా రూ. 10 కోట్ల విలువైన బియ్యం పాడైపోయాయి. ఆ బియ్యం తినడానికి పనికిరావని ఫుడ్‌ లేబొరేటరీ అధికారులు ధ్రువీకరించారు. ఈమేరకు మెదక్‌ జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ హరికృష్ణకు ఫుడ్‌ లేబొరేటరీ నుంచి లేఖ అందింది. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఏంచేయాలో, ఎవరిని బాధ్యులను చేయాలో తెలియక తెలియక పౌరసరఫరాలశాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

అనుమతి లేకుండానే నిల్వ

మెదక్‌ మండలం బాలాపూర్‌లో సత్యశ్రీరాంబాబుకు చేందిన గోదాములో 2021లో అప్పటి పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్వో) అప్పటి మెదక్‌ ఆర్డివోలు కలిసి కిరాయికి తీసుకున్నారు. మిల్లుల నుంచి వచ్చిన బియ్యం నిల్వ చేయడానికి గోదాంను కిరాయికి తీసుకునే ముందు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని తెలిసింది. బియ్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించారు. దీంతో పేదలకు పంపీణీ చేయాల్సిన 2,900 మెట్రిక్‌ టన్నుల బియ్యం ముక్కిపోయి నల్లగా మారాయి. బియ్యం సంచులు మొత్తం పురుగులు పట్టాయి. పాడైన బియ్యం విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది. కొద్ది నెలల క్రితం డీఎస్వో, ఆర్డీవోలు బదిలీ అయ్యారు. బదిలీపై వచ్చిన పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ హరికృష్ణ గత నవంబరులో జిల్లాలోని అన్ని గోదాంలతో పాటు బొల్లారం గ్రామంలోని గోదాంను కూడా సందర్శించారు. అక్కడ పురుగులు పట్టి పాడైపోయిన బియ్యాన్ని చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బియ్యం శాంపిళ్లను ఫుడ్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆ బియ్యం పూర్తిగా పాడైపోవడం వలన తినడానికి పనికిరావని లేబొరేటరీ ధ్రువీకరించింది.

Updated Date - Dec 18 , 2023 | 11:44 PM